Andhra Pradesh: భక్తులలానే నటిస్తూ.. గోవిందరాజస్వామి ఆలయంలోని కిరీటాల చోరీ!

  • కిరీటాలను ఎత్తుకెళ్లింది బయటి వ్యక్తులే
  • భక్తుల ముసుగులో వచ్చి చాకచక్యంగా పని పూర్తి చేసుకున్నారు
  • అనుమానితుడి ఫొటోను విడుదల చేసిన ఎస్పీ

సంచలనం సృష్టించిన తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలోని కిరీటాలను దొంగిలించింది ఎవరో మొత్తానికి గుర్తించారు. భక్తుల ముసుగులో వచ్చిన దొంగలే వాటిని ఎత్తుకెళ్లినట్టు నిర్ధారించారు. అర్చకులు లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు చాకచక్యంగా దోచుకెళ్లినట్టు  పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల విచారణలో తేలింది.  

కిరీటాల చోరీ ఘటనలో ఆలయ సిబ్బంది, అర్చకుల ప్రమేయంపై అధికారులు తొలుత విచారణ చేపట్టారు. అయితే, వారి హస్తం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కొందరు అనుమానితులను గుర్తించారు. తిరుపతిలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన వ్యక్తితోపాటు ఆటో డ్రైవర్‌ను  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో అనుమానితుడి ఫొటోను సోమవారం రాత్రి తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ విడుదల చేశారు.

 మరోవైపు, చోరీ జరిగిన రోజున ఆలయ పరిసర ప్రాంతాల్లోని సెల్ టవర్ ఆధారంగా కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. ఆలయంలోని సీసీ కెమెరా కొన్ని రోజులుగా ఎందుకు పనిచేయడం లేదన్న విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

More Telugu News