siddaramaiah: ఆమె నా చెల్లిలాంటిది.. దురుద్దేశంతో చేయలేదు: సిద్ధరామయ్య

  • మహిళ చేతినుంచి మైక్ లాక్కున్న సిద్ధరామయ్య
  • ఊహించని విధంగా ఆయన చేతిలోకి వచ్చిన మహిళ చున్నీ
  • దురుద్దేశంతో తాను ఆ పని చేయలేదన్న సిద్ధరామయ్య

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు టైమ్ బాగున్నట్టు లేదు. పొరపాటున జరిగిన ఓ ఘటనతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో, ఓ మహిళ నుంచి మైకు లాక్కునే సందర్భంలో... ఆమె చున్నీ కూడా కొంత మేర ఆయన చేతిలోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనకు తలనొప్పులు ఎదురయ్యాయి. ఆయనపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మహిళా కమిషన్ కర్ణాటక పోలీసులకు సూచించింది.

తనపై వచ్చిన ఆరోపణలపై సిద్ధరామయ్య స్పందించారు. తాను ఎలాంటి దురుద్దేశంతో ఆ పని చేయలేదని ఆయన తెలిపారు. పొరపాటున అది జరిగిపోయిందని చెప్పారు. ఆమె 15 ఏళ్లుగా తనకు తెలుసని... తన సోదరి వంటిదని అన్నారు. ఆమె సుదీర్ఘంగా మాట్లాడుతుండగా... ఆమెను ఆపే ప్రయత్నం చేశానని... అప్పుడు పొరపాటున ఆ సంఘటన జరిగిందని చెప్పారు. దీన్ని అనవసరంగా వివాదం చేయవద్దని కోరారు.

More Telugu News