Bollywood: బతకడానికి కొత్తిమిర అమ్మాను.. నా తొలి వేతనంలో సగం కోఆర్డినేటర్ లాక్కున్నాడు!: నవాజుద్దీన్ సిద్దిఖీ

  • 'ఠాక్రే' సినిమాలో నటించిన సిద్దిఖీ
  • 'పేట'లో ఆయన నటనకు ప్రశంసలు
  • కష్టాల వల్లే డబ్బు విలువ తెలిసిందన్ననటుడు

నవాజుద్దీన్ సిద్దిఖీ.. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించే ఈ నటుడు ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'పేట' సినిమాలో మెరిశారు. ప్రస్తుతం అభిజీత్‌ పాన్సే దర్శకత్వం వహించిన ‘ఠాక్రే’ సినిమాలో ఆయన శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే పాత్రలో నటించారు. అయితే కెరీర్ ప్రారంభంలో తాను అవకాశాల కోసం బాగా ఇబ్బంది పడ్డానని నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలిపారు. ఠాక్రే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముంబైకి వచ్చిన కొత్తల్లో ఓ కూరగాయలు అమ్మే షాపు నుంచి రూ.200 వెచ్చించి కొత్తిమిరను కొనుగోలు చేశానని సిద్దిఖీ తెలిపారు.

దీన్ని అమ్మేసి సొమ్ము చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే మధ్యాహ్నానికే అవి వాడిపోయాయనీ, దీంతో తన జేబులు ఖాళీ అయిపోయానని పేర్కొన్నారు. ఈ విషయమై షాపు ఓనర్ దగ్గరకు వెళ్లగా, కొత్తిమిర మీద నీళ్లు చల్లుతూ ఉంటేనే తాజాగా ఉంటాయని చెప్పాడన్నారు. డబ్బులు లేకపోవడంతో వాళ్లనూ, వీళ్లనూ లిఫ్ట్ అడుగుతూ ఇంటికి చేరానని గుర్తుచేసుకున్నారు.

తనకు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ రావడంపై మాట్లాడుతూ,..‘నేను జూనియర్ ఆర్టిస్టుగా అందుకున్న తొలి పారితోషికం రూ.4,000. అయితే నాకు ఆర్టిస్ట్ గా కార్డు లేకపోవడంతో నాకు ఛాన్స్ ఇచ్చిన కోఆర్డినేటర్‌ నగదులో సగానికి పైగా తీసేసుకున్నాడు. చివరిగా నా దగ్గర మిగిలిన రూ.1800తో సెలబ్రేట్ చేసుకున్నా. మిగిలిన డబ్బు తిరగడానికే సరిపోయింది. అలా మళ్లీ చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయిపోయింది. అప్పుడే నాకు డబ్బు విలువ తెలిసొచ్చింది’ అని సిద్దిఖీ చెప్పుకొచ్చారు. 

More Telugu News