PARLIAMENT: లోక్ సభలో టీడీపీకి షాక్.. 14 మంది ఎంపీలను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్!

  • ప్రత్యేకహోదాపై టీడీపీ నేతల ఆందోళన
  • సభ నుంచి బయటకు రాని టీడీపీ ఎంపీలు
  • 9 మంది అన్నాడీఎంకే సభ్యులపైనా వేటు

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ లోక్ సభ సభ్యులకు స్పీకర్ సుమిత్రా మహాజన్ షాకిచ్చారు. తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని చెప్పినా వినకపోవడంతో కొరడా ఝుళిపించారు. 14 మంది టీడీపీ సభ్యులను నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేస్తూ ఈరోజు ఆదేశాలు జారీచేశారు.

గల్లా జయదేవ్, మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు, తోట నరసింహం, బుట్టా రేణుక, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాగంటి బాబు, శ్రీరామ్ మాల్యాద్రి, అశోక్ గజపతి రాజు, కొనకళ్ల నారాయణ, పండుల రవీంద్రబాబు, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్ రెడ్డిపై స్పీకర్ ఈరోజు సస్పెన్షన్ వేటు వేశారు.

సస్పెన్షన్ నేపథ్యంలో సభ నుంచి బయటకు వెళ్లాలని కోరగా అందుకు టీడీపీ నేతలు నిరాకరించారు. లోక్ సభలోనే తమ ఆందోళనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోపక్క, తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న 9 మంది అన్నాడీఎంకే సభ్యులను సైతం స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం సభను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

More Telugu News