plastic: ప్లాస్టిక్ భూతంపై యుద్ధం ప్రకటించిన చికెన్ షాపు యజమాని!

  • ప్లాస్టిక్ వాడకాన్ని నిరుత్సాహపరిచేలా చర్యలు
  • కేజీ చికెన్ కొంటే నాలుగు కోడిగుడ్లు ఫ్రీ
  • ఎగబడుతున్న ప్రజలు

ప్లాస్టిక్ రక్కసి మన పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తోంది. ఇది భూమిలో కలిసిపోవడానికి కొన్ని వేల ఏళ్లు పట్టే అవకాశం ఉండటంతో ఇప్పుడు ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించడానికి చాలా దేశాలు నడుం బిగించాయి. ఇందులో భాగంగా 40 మైక్రాన్లు, అంతకంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ చాలా రాష్ట్రాలు ఆదేశాలు జారీచేశాయి. ఈ క్రమంలోనే ఓ చికెన్ షాపు యజమాని సైతం ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నాడు.

తమిళనాడులోని మధురైవాసి చిన్మయానందం షాపుకు వెళ్లి కేజీ చికెన్ కొంటే నాలుగు కోడిగుడ్లు ఫ్రీగా ఇస్తాడు. అయితే చిన్న షరతు పెడతాడు. షాపులో చికెన్ తీసుకెళ్లేందుకు కస్టమర్లు సొంత పాత్రలను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు చిన్మయానందం షాపుకు వచ్చేవారిలో 90 శాతం మంది ఇంటి నుంచి బాక్సులు, ఇతర పాత్రలను తెచ్చుకుంటున్నారు.

అయితే ఈ వెసులుబాటు లేనివాళ్ల కోసం చిన్మయానందం మరో ఆఫర్ ఇస్తున్నాడు. పాత్రలు తీసుకురాలేనివారికి తానే బాక్సులను అందజేస్తున్నాడు. ఇందుకోసం రూ.40 డిపాజిట్ గా తీసుకుంటాడు. తిరిగి ఆ బాక్సును కస్టమర్లు తెచ్చిస్తే, తీసుకున్న డిపాజిట్ ను చిన్మయానందం వెనక్కు ఇచ్చేస్తాడు. ఈ ప్రయత్నం బాగుంది కదూ.

More Telugu News