TRS: టీఆర్ఎస్ లోకి ఇల్లందు ఎమ్మెల్యే వెళతారని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత!

  • ఇల్లందులో గెలుపొందిన హరిప్రియ
  • తొలి గిరిజన మహిళగా రికార్డు
  • కొందరు కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ పై బానోత్ హరిప్రియ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే హరిప్రియ త్వరలోనే టీఆర్ఎస్ లో చేరుతారని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ లోని గార్ల లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన హరిప్రియ మీడియాతో మాట్లాడారు. ఇల్లందు నియోజకవర్గం చరిత్రలో గిరిజన మహిళ ఇప్పటివరకూ విజయం సాధించలేదని హరిప్రియ తెలిపారు. తాను విజయం సాధించడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారుతానని కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాణామున్నంత వరకూ కాంగ్రెస్ పార్టీని వీడబోనని స్పష్టం చేశారు.

తనపై దుష్ప్రచారం చేస్తున్న దుష్ట శక్తులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన ఇల్లందు నియోజకవర్గంలో అనేక వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ గెలిచిన ప్రజా ప్రతినిధులు తమ స్వప్రయోజనాల కోసం పని చేశారే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు ప్రణాళికను రూపొందిస్తామని హరిప్రియ తెలిపారు. ఏజెన్సీలో గిరిజన, గిరిజనేతరుల సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని అన్నారు. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఆడ బిడ్డగా ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ అభివృద్ధి పనులతో సేవలందిస్తానని అన్నారు.
 

More Telugu News