YSRCP: వైసీపీలోకి మంత్రి పితాని సత్యనారాయణ.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ నేత!

  • సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం
  • ఆచంటలో వైసీపీ తరఫున పోటీచేస్తారని సందేశాలు
  • జనసేన కంటే వైసీపీ వైపే ఆసక్తి చూపుతున్నట్లు వ్యాఖ్యలు

టీడీపీ నేత, ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ పార్టీ మారబోతున్నారా? త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పితాని గెలుపొందిన ఆచంట నియోజకవర్గంలో వాట్సాప్, ఫేస్ బుక్ సహా పలు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీకి పితాని గుడ్ బై చెబుతారని సోషల్ మీడియాలో సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి.

జనసేన కంటే వైసీపీలో చేరేందుకే పితాని ఆసక్తి చూపుతున్నట్లు మెసేజ్ లు షేర్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పితాని అనుచరులు, మద్దతుదారులతో పాటు టీడీపీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. తనను ఎదురుగా వచ్చి ఎదుర్కొనే ధైర్యంలేనివాళ్లే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాటిమాటికీ ఇలాంటి ఆరోపణలకు వివరణ ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఎవరైతే ఈ ప్రచారం చేస్తున్నారో దమ్ముంటే మీడియా ముందుకొచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. గ్రామదర్శిని కార్యక్రమం నుంచి పార్టీ సభ్యత్వాల నమోదు వరకూ తాను నియోజకవర్గంలో బిజీగా ఉన్నానని తెలిపారు. రాజమహేంద్రవరంలో త్వరలో నిర్వహించబోయే బీసీ సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు.

More Telugu News