Telangana: రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశామంటే.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల అధికారి రజత్ కుమార్!

  • కోస్గీ సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించారు
  • టీఆర్ఎస్ పార్టీ దీనిపై ఫిర్యాదు చేసింది
  • కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతోనే చర్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొడంగల్ లోని కోస్గీలో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా రేవంత్ అరెస్ట్ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో తెలంగాణ ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారి రజత్ కుమార్ ఈ రోజు హైదరాబాద్ లో స్పందించారు. కొడంగల్ లో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉండటంతోనే రేవంత్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. రేవంత్ హెచ్చరికలపై టీఆర్ఎస్ నేతలు తమకు ఫిర్యాదు చేశారన్నారు.

ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించినట్లు పేర్కొన్నారు. కేంద్రస్థాయిలో వచ్చిన ఆదేశాలతోనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారికి తాను ఉత్తర్వులు జారీచేశానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లు తాము ఎవ్వరితోనూ కుమ్మక్కు కాలేదనీ, అలాంటి పని ఈసీ చేయదని తేల్చిచెప్పారు. తమకు అన్ని రాజకీయ పార్టీలు సమానమేనన్నారు. తెలంగాణలో డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రజత్ కుమార్ ప్రకటించారు.

More Telugu News