Telangana: చంద్రబాబు ఓ మెంటల్ కేసు.. ఈయన హైదరాబాద్ కడితే, కులీకుతుబ్ షా ఆత్మహత్య చేసుకోవాలా?: కేసీఆర్

  • అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఇటుక కూడా పడలేదు
  • కుదిరితే చార్మినార్ కూడా తానే కట్టానంటారు
  • 103-106 సీట్లను దక్కించుకోబోతున్నాం

అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఇప్పటివరకూ ఒక్క భవనాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్మించలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టానని చంద్రబాబు చెప్పడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు 24 గంటల విద్యుత్ ను ఎందుకు అందించలేకపోయారని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ వచ్చాక ఇప్పుడు 24 గంటలపాటు విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు దేశంలో సగటు విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర సంస్థలు కితాబిచ్చాయని వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఈరోజు నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో జీవన విధ్వంసం జరిగిందని కేసీఆర్ ఆరోపించారు. అన్నివర్గాలు చికితిపోయారనీ, ఇప్పుడు తెలంగాణను చక్కదిద్దుతున్నామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడానికి రైతు బంధు, రైతు బీమాను తీసుకొచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఓ మెంటల్ కేసు అనీ, అందుకే హైదరాబాద్ ను తానే కట్టానని గొప్పలు చెప్పుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు. చంద్రబాబు హైదరాబాద్ ను కడితే భాగ్యనగర నిర్మాత కులీకుతుబ్ షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో చార్మినార్ కూడా చంద్రబాబే కట్టారని అంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. హైదరబాద్ నగరం చల్లగా ఉండాలని కులీకుతుబ్ షా నమాజ్ చేసి చార్మినార్ ను నిర్మించారని అన్నారు.

హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టినోడు.. ఐదేళ్లలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. ఇలాంటి మోసగాళ్లకు ఓటువేస్తే ఆగమైపోతామని హెచ్చరించారు. కల్యాణలక్ష్మి, రైతు బంధు, అవ్వాతాతలకు పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 103-106 సీట్లు దక్కించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గంలో మహేశ్వర్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News