TRS: టీఆర్ఎస్ కు 103 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి: కేసీఆర్

  • ఎన్నికల్లో ప్రజలు, వారి ఆకాంక్షలు గెలవాలి
  • నన్ను కొట్టడం చేతకాక... కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును మోసుకొచ్చింది
  • చంద్రబాబును, కాంగ్రెస్ ను కాగ్నా నదిలో కలపాలి

ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత ప్రధానమైనవని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తాండూరు బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ... ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు, నాయకులు కాదని... ప్రజలు, వారి ఆకాంక్షలు గెలవాలని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 103 నుంచి 106 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు.

ఇసుక స్మగ్లింగ్ ను 50 శాతం అరికడితేనే ఇంత ఆదాయం పెరిగిందని... పూర్తిగా అరికడితే ఇంకెంత ఆదాయం ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. తాండూరులో స్టోన్ కట్టింగ్ ఇండస్ట్రీని స్థాపిస్థామని చెప్పారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు భయపడకుండా ఉండాలనే కళ్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. 70 లక్షల గొర్రెలను రాష్ట్రంలో పంపిణీ చేశామని... వాటికి 40 లక్షల గొర్రెలు పుట్టాయని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ ను కొట్టడం కాంగ్రెస్ వాళ్లకు చేతకావడం లేదట... అందుకే అమరావతికి వెళ్లి చంద్రబాబును మోసుకొచ్చారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడిన చంద్రబాబును ఇక్కడ అడుగుపెట్టకుండా అడ్డుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని మళ్లీ వేరే రాష్ట్రం వాళ్లకి అప్పగించవద్దని విన్నవించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చాలా మేధావులని... కరెంట్ ఇచ్చే విషయంలో వారి మేధావితనం ఏమైందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబును, ఆయనను మోసుకొచ్చిన కాంగ్రెస్ ను కాగ్నా నదిలో కలపాలని పిలుపునిచ్చారు. రోజురోజుకూ టీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుందని అన్నారు. 

More Telugu News