Scientists: 130 ఏళ్ల తర్వాత మారిన కేజీ లెక్క.. మారిన నిర్వచనం!

  • కిలో రాయి నిర్వచనాన్ని మార్చిన శాస్త్రవేత్తలు
  • ఇకపై ‘ఎలక్ట్రిక్ కిలో’గా పిలుపు
  • ‘లీ గ్రాండ్ కె’కు ఇక కాలం చెల్లినట్టే

దాదాపు 130 ఏళ్ల తర్వాత కిలో నిర్వచనం మారింది. కిలో లెక్కకు ప్రామాణికంగా భావించే కిలోరాయి ఒకటి ప్రాన్స్ భూగర్భంలో పదిలంగా ఉంది. ప్లాటినం, ఇరిడియం మిశ్రమంతో 1889లో తయారుచేసిన ఈ కిలోరాయికి శుక్రవారంతో కాలం చెల్లింది. ఇకపై విద్యుత్ శక్తితో కొలిచే సరికొత్త నిర్వచనాన్ని శాస్త్రవేత్తలు సూచించారు. దీనిని ఇక నుంచి ‘ఎలక్ట్రిక్ కిలో’, ‘ఎలక్ట్రానిక్ కిలో’గా వ్యవహరిస్తారు.

కిలోకు తల్లిరాయిగా భావించే రాయి అత్యంత భద్రత మధ్య పారిస్ సమీపంలోని సెవరెస్ ప్రాంతంలోని భూగర్భంలో ఉంది. మూడు జాడాల కింద అరచేతి ప్రమాణంలో ఉన్న ఈ రాయిని ‘లీ గ్రాండ్ కె’గా పిలుస్తారు. నాలుగు దశాబ్దాలకు ఒకసారి వివిధ దేశాలన్నీ తమ వద్ద ఉన్న కిలో రాయిని సెవరెస్‌కు తీసుకెళ్లి దాని బరువుతో సరిచూసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా కిలోకు అత్యంత కచ్చిత ప్రమాణం ఇదే. మన దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న నేషనల్ ఫిజికల్ లేబొరెటరీలో ‘లీ గ్రాండ్ కె’తో పోల్చి చూసే ఓ కడ్డీ ఉంది. దీనిని నెంబరు 57గా పిలుస్తారు.

కాగా, శుక్రవారం ఫ్రాన్స్‌లోని వెర్‌సెయిల్లే నగరంలో 60 దేశాల పరిశోధకులు సమావేశమయ్యారు. ‘లీ గ్రాండ్ కె’ బదులుగా కొత్త ప్రమాణాన్ని తీసుకొచ్చారు. విద్యుత్ శక్తితో కొలిచి సరిచూసుకునే విధానానికి అందరూ అనుకూలంగా ఓటేశారు. ఇప్పటి వరకు భౌతికంగా కొలిచే కిలోరాయికి బదులు ఇకపై విద్యుత్‌తో కొలుస్తారు. ఇందుకోసం సరికొత్త నిర్వచనాన్ని ప్రతిపాదించారు. ‘కిబుల్ బ్యాలెన్స్’ అని దీనికి పేరు పెట్టారు. ఈ కారణంగా వివిధ దేశాలు ఇకపై తమ కిలో రాళ్లను ఫ్రాన్స్ తీసుకొచ్చే బాధ తప్పుతుంది. శాస్త్రవేత్తల తాజా నిర్ణయం వల్ల కిలో రాయి అలాగే ఉంటుంది. అయితే, దానిని కొలిచే విధానమే మారుతుందన్నమాట. మారిన నిర్వచనం ప్రపంచ కొలతల దినోత్సవమైన 20 మే 2019 నుంచి అమల్లోకి రానుంది. 

More Telugu News