Chandrababu: తిత్లీ తుఫాను సమయంలో దసరాను త్యాగం చేసిన అధికారులకు చంద్రబాబు బంపరాఫర్!

  • బాధితులకు పరిహారం పంపిణీ చేసిన చంద్రబాబు
  • అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి
  • దీపావళికి వారం రోజుల సెలవులు

తిత్లీ తుపాను సమయంలో నిరంతరాయంగా విధులు నిర్వర్తించిన అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో తిత్లీ తుపాను బాధితులకు రూ.350 కోట్ల పరిహారాన్ని సీఎం పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇటీవలి ఢిల్లీ పరిణామాలపై ప్రజలకు వివరించారు.

 వ్యవస్థలన్నింటినీ కేంద్రం దెబ్బతీస్తున్నందుకే  తాను ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యం దెబ్బతింటే మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ ఆలోచించాకే తాను ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీలను ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసినట్టు చెప్పారు. తిత్లీ తుపాను సమయంలో నిరంతరాయంగా విధులు నిర్వర్తించి, బాధితులకు సేవలు అందించిన అధికారులను చంద్రబాబు అభినందించారు.

దసరాకు ఇంటికి సైతం వెళ్లకుండా విధులు నిర్వర్తించారని కొనియాడారు. దసరా జరుపుకోని వారు దీపావళిని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందుకోసం వారికి వారం రోజులపాటు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగిన తర్వాతే ఇంటికి వెళ్తామని అధికారులు తనతో చెప్పారని, దసరాకు ఇంటికి వెళ్తామని నోరువిడిచి అడగలేదని అన్నారు. అందుకనే వారికి దీపావళికి వారం రోజులపాటు సెలవులు ఇస్తున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

More Telugu News