Chandrababu: కేంద్రం సహకరించకపోయినా తుపాన్ బాధితులకు న్యాయం చేశాం!: సీఎం చంద్రబాబు

  • పలాసలో కిడ్నీ పరిశోధనా సంస్థకు శంకుస్థాపన
  • తిత్లీ తుపాన్ నాకు కొత్త అనుభవం నేర్పింది
  • లోపాలు సరిదిద్దుకొని భవిష్యత్ లో సమర్థంగా పనిచేస్తాం

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కిడ్నీ పరిశోధనా సంస్థకు శంకుస్థాపన చేశారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా తిత్లీ బాధితులతో చంద్రబాబు సమావేశం జరిపారు.తుపాన్ బాధితులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు.

అనంతరం, బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తిత్లీ తుపాన్ ఉద్దానం ప్రజల్లో ఉక్కు సంకల్పాన్ని నింపిందని, ప్రజలు అధైర్య పడాల్సిన పని లేదని, ఉద్దానానికి పూర్వవైభవం తీసుకొస్తామని మరోసారి స్పష్టం చేశారు. తిత్లీ తుపాన్ భయంకరమైన వాతావరణాన్ని సృష్టించిందని, అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని, కార్యకర్తల కంటే ఎక్కువగా అధికారులే సహాయక చర్యల్లో పాల్గొన్నారని అన్నారు.

మంత్రులు, అధికారుల పనితీరు అభినందనీయమని, దసరా పండగను తుపాను బాధితుల మధ్యే గడిపారని ప్రశంసించారు. తిత్లీ తుపాన్ తనకు కొత్త అనుభవాన్ని నేర్పిందని, లోపాలను సరిదిద్దుకొని భవిష్యత్ లో సమర్థంగా పనిచేస్తామని, ప్రజాసమస్యల కంటే పండగలేమీ ప్రభుత్వానికి ఎక్కువ కాదని అన్నారు.

సరైన సమయంలో సాయం అందజేస్తేనే ప్రజలకు ప్రయోజనమని, తుపాన్ బాధిత రైతులందరికీ న్యాయం చేస్తామని, హెక్టారుకు రూ.40 వేల చొప్పున సాయం చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా తుపాన్ బాధితులకు న్యాయం చేశామని, తప్పుడు సమాచారంతో నష్టపరిహారం కాజేయాలని చూస్తే ‘ఖబడ్దార్’ అని, ప్రభుత్వాన్ని మోసం చేయాలని చూసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News