Bihar: బీహార్లో సీనియర్ పోలీసులను చితకబాదిన ట్రైనీ పోలీసులు!

  • అనారోగ్యంతో బాధపడుతున్న మహిళా కానిస్టేబుల్
  • సెలవు ఇవ్వడానికి నిరాకరణ
  • ఆమె మృతితో రెచ్చిపోయిన జూనియర్లు

బీహార్ రాజధాని పాట్నాలో పోలీసులు-పోలీసులు చితక్కొట్టుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసు ట్రైనీలు.. సీనియర్లను చావబాదారు. పోలీస్ లైన్స్‌లో పోస్టింగ్ వేసిన మహిళా కానిస్టేబుల్ సవితా పాఠక్ మృతి ఈ ఘటనకు కారణమైంది. ఆమె మృతితో ఆగ్రహం వ్యక్తం చేసిన జూనియర్లు ఆందోళన నిర్వహించారు. వందలాదిమంది శిక్షణ పోలీసులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

సవిత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోందని, సెలవు అడిగినా ఇవ్వలేదని సహచర పోలీసులు ఆరోపించారు. చికిత్స కోసం సెలవు అడిగితే ఇవ్వలేదని, దీంతో పరిస్థితి విషమించి ఆమె మృతి చెందిందని ఆరోపించారు. సవితను ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో పోలీస్ లైన్స్‌లోని పోలీసులు ఆందోళనకు దిగారు. సీనియర్ పోలీసులపై దాడి చేసి చితకబాదారు. కిటికీలను పగలగొట్టారు. వాహనాలను ధ్వంసం చేశారు. జీపులు, బస్సులను పూర్తిగా ధ్వంసం చేశారు. అంతేకాదు, సీనియర్ల వాహనాలను కూడా వారు వదల్లేదు.

పోలీస్ లైన్స్ బయట గుమిగూడిన ప్రజలను, దాడిని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపైనా దాడికి దిగారు. పరిస్థితి మరింత దిగజారడంతో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మను మహారాజ్, రూరల్ ఎస్పీ , సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చివరికి బీహార్ మిలటరీ పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. జూనియర్ల దాడిలో టాప్ పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పాట్నా ఎస్సెస్పీ మను మహారాజ్ తెలిపారు.

More Telugu News