Eastcoast Railway: తిత్లీ ఎఫెక్ట్: రైల్వే ట్రాకులపై చెట్లు.. కుప్పకూలిన సిగ్నలింగ్ వ్యవస్థ.. పలు రైళ్ల రద్దు

  • రైల్వే ట్రాక్‌లపై కూలిన చెట్లు
  • దెబ్బతిన్న సిగ్నల్ వ్యవస్థ
  • కొనసాగుతున్న మరమ్మతులు

తిత్లీ తుపాను ఉత్తరాంధ్రను కుదిపేసింది. తుపాను బీభత్సానికి శ్రీకాకుళం చిగురుటాకులా వణికింది. 140 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన గాలులతో వృక్షాలు కుప్పకూలాయి. రైల్వే ట్రాక్‌లపై చెట్లు కూలడం, సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బ తినడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లను గురువారం తూర్పు రైల్వే అధికారులు రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. నేడు కూడా కొన్ని రైళ్లను రద్దు చేసిన అధికారులు, మరికొన్నింటిని దారి మళ్లించారు.

గురువారం హౌరా-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, సంత్రగచ్చి-చెన్నై స్పెషల్, బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా-హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-భాగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్, ఖరగ్‌పూర్-విల్లుపురం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు. రైళ్ల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్లాట్‌ఫామ్‌లపై పడిగాపులు కాశారు. గాలుల దెబ్బకు పలాస రైల్వే స్టేషన్ తీవ్రంగా దెబ్బతిందని, పలుచోట్ల సిగ్నలింగ్ వ్యవస్థ పాడైందని, బరంపురం-కోటబొమ్మాళి మధ్య విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

More Telugu News