dowry: 'షీ టీమ్' కానిస్టేబుల్ కి కట్నం వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు!

  • హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఘటన
  • కట్నం కోసం టెక్కీ భర్త, అత్తామామల వేధింపులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా పోలీస్

సాధారణంగా బస్టాండ్ లో పోకిరీలు వేధించినా, సోషల్ మీడియాలో ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసినా మహిళలు, యువతులు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. రోడ్లు, బస్టాండ్లలో యువతులను వేధించే పోకిరీలను షీ టీమ్స్ పట్టుకుని కటకటాల వెనక్కు నెడుతుంటాయి. అయితే తాజాగా షీ టీమ్ పోలీస్ కే వేధింపులు ఎదురయ్యాయి. అయితే ఆమెను వేధించింది బయట వారు కాదు.. ఇంట్లో భర్త, అత్తామామలే!

నల్గొండ జిల్లా గొల్లగూడకు చెందిన ఓంప్రకాష్, కనాజీగూడకు చెందిన రజనీలకు జనవరి 2018లో వివాహమైంది. ఓంప్రకాశ్ ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా, రజనీ ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ లో షీ టీమ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. వివాహం సమయంలో రజనీ తల్లిదండ్రులు కట్నకానుకలు భారీగా సమర్పించుకున్నారు. అయినా ఇంకా అదనపు కట్నం తీసుకురావాలని ఓంప్రకాశ్, అతని తల్లిదండ్రులు రజనీని వేధించసాగారు.

ఈ వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు గత నెల 9న కేసు పెట్టింది. అయితే ఇకపై ఎలాంటి వేధింపులకు పాల్పడబోమని కుటుంబ సభ్యులు హామీ ఇవ్వడంతో కేసును ఉపసంహరించుకుంది. తిరిగి వేధింపులు ప్రారంభం కావడంతో ఆమె ఆల్వాల్ పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం కెనడాకు పారిపోయేందుకు ఓంప్రకాశ్ యత్నిస్తున్నాడనీ, తనకు న్యాయం జరిగేవరకూ అతడిని దేశం దాటి వెళ్లకుండా అడ్డుకోవాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More Telugu News