Petrol: పండగ చేసుకోవాలా?... రూ. 35 విలువైన పెట్రోలును రూ. 90కి అమ్ముతూ రెండున్నర తగ్గింపా?

  • పెట్రోలుపై సుంకాలను తగ్గించిన కేంద్రం
  • ఇదేమీ పెద్ద ఊరట కాదంటున్న ప్రజలు
  • ఎన్నికలు వస్తున్న కారణంగానేనని సెటైర్లు

ఆకాశానికి అంటిన పెట్రోలు, డీజిల్ ధరల నుంచి కాస్తంత ఉపశమనాన్ని కల్పిస్తూ, రూ. 2.50 మేరకు కేంద్రం తగ్గించిన నేపథ్యంలో, సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వస్తున్నాయి. కొద్దిమంది మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తుండగా, చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ధరలు పెరుగుతూ ఉంటే చూస్తుండిపోయిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పండగ చేసుకోమన్నట్టు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు.

చాలా దేశాల్లో పెట్రోలును రూ. 35కే విక్రయిస్తున్నారని, ఇండియాలో రూ. 90 వసూలు చేస్తూ, కేవలం రెండున్నర రూపాయలు తగ్గించడం ఏంటని అడుగుతున్నారు. పలు రాష్టాల్లో ఎన్నికలు రానున్నందునే ఈ రెండున్నరను డిస్కౌంట్ గా ఆఫర్ చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్న బీజేపీ, తమ అవినీతి నుంచి వారి దృష్టిని మరల్చేందుకే పెట్రోలు తాయిలం ప్రకటించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, కేంద్రం సుంకాలను తగ్గించిన తరువాత, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అంతేమొత్తం సుంకాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే.

More Telugu News