YUVANESTAM: ‘యువనేస్తం’ ఏర్పాట్లలో అధికారుల అలసత్వం.. కోపంతో పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్యే!

  • సినిమా చూపించారంటూ శివాజీ ఆగ్రహం
  • ఎంతసేపు ఎండలో కూర్చోబెడతారని ప్రశ్న
  • శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో ఘటన

అసలే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీనికి తోడు కరెంట్ కోత. ఇలా ఎంతసేపు ఓపిక పట్టినా అధికారులు స్పందించకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే శివాజీ ఆగ్రహోద్రులయ్యారు. అధికారులపై చిర్రుబుర్రులాడుతూ సమీపంలోని పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ లోకి వెళ్లిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అలగడంతో అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు నెలకు రూ.వెయ్యి ఆర్థిక సాయం చేసేందుకు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం కాశీబుగ్గలో నిన్న జరిగింది. దీనికి చాలామంది నిరుద్యోగులు రాగా, ఉదయం 10.30 గంటలకు పలాస ఎమ్మెల్యే శివాజీ సభా వేదిక వద్దకు వచ్చారు. విద్యుత్ లేకపోవడం, ఎండ తీవ్రంగా ఉన్నా గంటపాటు ఓపిక పట్టారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఒక్కసారిగా ఆయన సహనం కోల్పోయారు.

‘ఎండలు మండిపోతున్నాయి. ఎంతసేపని మాతో పాటు ఇలా ప్రజలను కూర్చోబెడతారు? మొత్తం మీద నాకే సినిమా చూపించారు’ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయి సమీపంలోని పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ లో కూర్చున్నారు. దీంతో ఏర్పాట్లను శరవేగంగా పూర్తిచేసిన పలాస ఎంపీడీవో సూర్యనారాయణ.. ఎమ్మెల్యే శివాజీ వద్దకు వెళ్లి నచ్చజెప్పడంతో ఆయన వేదికపైకి తిరిగివచ్చారు. ఈ ఘటనతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News