Road Accident: దేశంలో తొలిసారి సరికొత్త బిల్లును తీసుకొచ్చిన కర్ణాటక.. రాష్ట్రపతి ఆమోదం!

  • రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులను ఆదుకునేలా ప్రోత్సహిస్తున్న చట్టం
  • బాధితులను ఆదుకుంటే ఇక కేసులుండవు
  • రెండేళ్ల క్రితమే రాష్ట్రపతికి పంపిన ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అత్యవసర సందర్భాల్లో రక్షణ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించే ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చాలామంది జంకుతుంటారు. పోలీసు కేసులు, చట్టపరమైన సమస్యలు మనకెందుకంటూ వాటి జోలికి పోరు. అయితే, ఇకపై అలాంటి భయాలు అవసరం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. బాధితులను రక్షించే వారికి పోలీసు కేసులు, చట్టపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

కర్ణాటక జీవరక్షక, వైద్య సాయం (అత్యవసర సందర్భాల్లో రక్షణ) నియంత్రణ బిల్లు-2016గా వ్యవహరించే ఈ బిల్లును రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించినట్టు  రవాణా శాఖ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తెలిపారు. ఈ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదాలు, ఘర్షణల్లో కత్తిపోట్లు వంటి వాటితో గాయపడిన బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లిన వారిపై ఎటువంటి కేసులు ఉండవు. బాధితులను రక్షించిన వారిని విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయరు.

More Telugu News