Indonesia: ఇండోనేషియాలో ప్రస్తుతం... ఆహారం కోసం షాపుల లూటీ, ఎటు చూసినా మృతదేహాలు!

  • సులవేసి దీవిని కుదిపేసిన సునామీ
  • 832కు పెరిగిన మృతుల సంఖ్య
  • మరింతగా పెరుగుతుందని అంచనా

ఎటు చూసినా మృతదేహాలు... శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతున్న వేలాది మంది... తినడానికి తిండిలేక షాపులను లూటీ చేస్తున్న ప్రజలు... ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం తరువాత కనిపిస్తున్న దృశ్యాలివి. దాదాపు 6 మీటర్ల ఎత్తున సునామీ అలలు ఎగిసి పడగా, తొలిరోజున 400 మంది వరకూ మరణించినట్టు అధికారిక ప్రకటన వెలువడగా, 24 గంటలు గడిచేసరికి ఆ సంఖ్య రెట్టింపై 832కు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం వుందని అంచనా. ముఖ్యంగా పలూ నగరం భీతావహంగా ఉంది. ఆకలి తీర్చుకునేందుకు షాపులపై పడుతున్న ప్రజలు, మంచినీటి ట్యాంకర్లను సైతం లూటీలు చేస్తున్నారు. అంటువ్యాధులు వ్యాపించకుండా మృతదేహాలను సామూహికంగా ఖననం చేస్తున్నారు.

ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని, సునామీ ప్రభావం చూపిన ప్రాంతాలకు ఇంకా సహాయక బృందాలు చేరుకోలేదని ఇండోనేసియా ఉపాధ్యక్షుడు జుసుఫ్‌ కల్లా ప్రకటించడం పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పకనే చెబుతోంది. భూకంపం తరువాత సులవేసీ దీవిలో ఉన్న విదేశీయుల్లో ముగ్గురు ఫ్రాన్స్ పౌరులు, దక్షిణ కొరియాకు చెందిన ఓ టూరిస్టు జాడ తెలియడం లేదని సమాచారం.

More Telugu News