Tripura: త్రిపుర సీఎం హత్యకు డ్రగ్స్ మాఫియా స్కెచ్.. హెచ్చరించిన హోంశాఖ!

  • డ్రగ్స్ మాఫియా ఆటకట్టించిన సీఎం బిప్లవ్ దేవ్
  • చంపేయాలని నిర్ణయించిన మాఫియా
  • భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీస్ శాఖ

మాఫియా గ్యాంగులు, రౌడీలు సాధారణంగా సిన్సియర్ పోలీస్ అధికారులను టార్గెట్ చేసుకున్న వార్తలను చదువుతుంటాం. కానీ మయన్మార్ కు చెందిన డ్రగ్స్ మాఫియా ఏకంగా ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నింది. త్రిపుర సీఎంపై పగపట్టిన మాఫియా ఆయన్ను చంపేందుకు స్కెచ్ వేసిన విషయాన్ని హోంశాఖ వర్గాలు చెప్పడంతో పోలీస్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

ఇటీవల త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టిన బిప్లవ్ కుమార్ దేవ్ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు ‘నిషా ముక్త్ భారత్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీసులు 50,000 కేజీల హెరాయిన్, గంజాయి, బ్రౌన్ షుగర్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మాఫియాలో సభ్యులుగా ఉన్న 120 మందిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మత్తుమందులన్నీ పక్కనే ఉన్న మయన్మార్ నుంచి దేశంలోకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమ డ్రగ్స్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న సీఎం బిప్లవ్ దేవ్ ను హతమార్చాలని మయన్మార్ కు చెందిన మాఫియా నిర్ణయించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ త్రిపుర ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

More Telugu News