team india: టీమిండియా క్రికెటర్లకు వార్నింగ్ ఇచ్చిన చీఫ్ సెలెక్టర్!

  • వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేని వారిపై వేటు తప్పదు
  • రిషబ్ పంత్ బ్యాటింగ్ సంతృప్తిని కలిగించింది
  • వెస్టిండీస్ టూర్ లో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పిస్తాం

టీమిండియా ఆటగాళ్లకు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. జాతీయ జట్టులో ఆడేందుకు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ... సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిపై వేటు వేసేందుకు వెనకాడబోమని హెచ్చరించాడు. జాతీయ జట్టుకు ఆడేందుకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకపోతే... దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న యువ ఆటగాళ్లపై దృష్టి సారించాల్సి వస్తుందని చెప్పాడు.

ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ తనకు సంతృప్తిని కలిగించిందని తెలిపాడు. రిషబ్ బ్యాటింగ్ పై తనకు ఎప్పుడూ, ఎలాంటి అనుమానం లేదని... అయితే, అతని కీపింగ్ నైపుణ్యాలు మరింత మెరుగు పడాల్సి ఉందని చెప్పాడు.

ఆసియా కప్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇచ్చినట్టే.... మరి కొందరు ఆటగాళ్లకు కూడా రెస్ట్ కల్పిస్తామని ప్రసాద్ తెలిపాడు. వెస్టిండీస్ టూర్ లో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతిని కల్పిస్తామని చెప్పాడు. దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న మయాంక్ అగర్వాల్ కు త్వరలోనే అవకాశం వస్తుందని తెలిపాడు.

More Telugu News