2007: బ్రేకింగ్... ఇద్దరిని దోషులుగా ప్రకటించిన కోర్టు... హైదరాబాద్ పేలుళ్లపై తీర్పు!

  • 2007 పేలుళ్లలో 44మంది మృతి
  • ఐదుగురు నిందితులను విచారించిన న్యాయస్థానం
  • వచ్చే సోమవారం శిక్ష ఖరారు 

11 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిలో ఈ రోజు ఇద్దరిని దోషులుగా ప్రకటించిన ప్రత్యేక న్యాయస్థానం, మరో ఇద్దరిని ఆధారాలు లేవని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫీక్ సయీద్ లు దోషులని న్యాయమూర్తి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. వీరికి వచ్చే సోమవారం శిక్షలను ఖరారు చేస్తారు.

ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఫరూక్ షరాఫుద్దీన్ తార్కేష్, మొహమ్మద్ సిద్ధికి ఇస్రార్ అహ్మద్ షేక్ లను నిర్దోషులుగా ప్రకటించగా, తారిక్ అంజుమ్ పై తీర్పును న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు. ఇదే కేసులో పరారీలో ఉన్న రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ లపై విచారణ కొనసాగుతుందని తెలిపారు.

కాగా, సెక్యూరిటీ కారణాలతో ఈ ఐదుగురినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన న్యాయస్థానం, వచ్చే సోమవారం నాడు ఇద్దరు దోషులకూ శిక్షలను ప్రకటించనుంది. 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్క్ లలో జంట పేలుళ్లు జరుగగా, 44 మందికి ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. కొన్ని వందల మంది జీవితాలపై బాంబు పేలుడు ప్రమాదం ప్రభావాన్ని చూపింది. ఎంతో మంది తమ అవయవాలను కోల్పోయి ఇప్పటికీ జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు.

More Telugu News