mangalagiri: మంగ‌ళ‌గిరి రైల్వే స్టేష‌న్‌ కు స‌రికొత్త 'కళ'!

  •  ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ‌గా వినూత్న శోభ‌
  • క‌ళాకృతుల‌తో స‌రికొత్త రూపు
  • రేపు అధికారికంగా ప్ర‌జ‌ల‌కు అంకితం

మునుపెన్న‌డూ చూడ‌ని ఓ సుంద‌ర‌మైన రైల్వే స్టేష‌న్ చూడాలంటే గుంటూరు జిల్లాలోని మంగ‌ళ‌గిరికి వెళ్లాల్సిందే. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతానికి అతి స‌మీపంలో ఉన్న రైల్వేస్టేష‌న్ ఇప్పుడు ప‌ర్యాట‌క కేంద్రం అయింది. రాష్ట్రాన్ని ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణగా తీర్చిదిద్ద‌టంలో ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులుకోని రాష్ట్ర ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ మంగ‌ళ‌గిరి రైల్వేస్టేష‌న్‌ను సైతం అదే కోణంలో తీర్చిదిద్దింది. మంగళగిరి రైల్వే స్టేష‌న్ ప్రాంగ‌ణంలో ప్ర‌యాణికులు ఎక్క‌డ కూర్చున్నా, ఓ సుంద‌ర‌మైన కలంకారీ చిత్రం వారిని క‌నువిందు చేస్తుంది. మ‌న‌సును ఆహ్ల‌ాద ప‌రుస్తూ సంప్ర‌దాయ‌త‌కు పెద్ద‌పీట వేస్తూ ప్ర‌తి గోడ‌ను ఒక ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ తీర్చిదిద్దింది. కేంద్ర ప్ర‌భుత్వ నేతృత్వంలోని రైల్వేస్టేష‌న్‌ను సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని భావించ‌టం ఒక ఎత్తు అయితే, అందుకు తగ్గా అనుమ‌తులు పొంద‌డం మ‌రో పెద్ద క‌స‌ర‌త్తే. ప‌ర్యాట‌క‌, భాషా సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి సూచ‌న‌ల మేర‌కు   ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క సాధికార సంస్థ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి హిమాన్షు శుక్లా రంగంలోకి దిగారు. ప్ర‌త్యేకించి అమ‌రావ‌తి ప్రాంతం ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను రైల్వే శాఖ‌కు వివ‌రించి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు పొందారు. స్వ‌యంగా ప‌లుమార్లు  రైల్వే స్టేష‌న్‌ను సంద‌ర్శించిన అధికారులు ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం స్టేష‌న్‌లో క‌ళాకృతులు ఏర్పాటు చేసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. కాగా, ఈ ప‌ర్యాట‌క ఆక‌ర్షిత భ‌రిత‌మైన మంగ‌ళ‌గిరి రైల్వే స్టేష‌న్ ను రేపు అధికారికంగా ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు. రేపు ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్ధ చైర్మ‌న్ ఆచార్య జ‌య‌రామిరెడ్డి, ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా, ఉన్న‌త స్థాయి డివిజిన‌ల్ రైల్వే అధికారులు పాల్గొంటార‌ని ఏపీటీడీసీ ఎండీ హిమాన్హు శుక్లా తెలిపారు.

More Telugu News