madras high court: జడ్జీ కారునే టేకోవర్ చేసి దూషిస్తారా ?: లాయర్ దంపతుల లైసెన్సులను రద్దు చేసిన బార్ కౌన్సిల్

  • మద్రాస్ హైకోర్టు బార్ కౌన్సిల్ చర్య
  • దేశంలో ఎక్కడా వాదించరాదని ఆదేశం
  • 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం 

తాజాగా ఓ న్యాయవాదుల జంట హైకోర్టు జడ్జీ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించడంతో వారి లైసెన్సులు రద్దయ్యాయి. జూలై 30న చెన్నైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్రాస్ హైకోర్టులోని ఓ జడ్జీ కారును అక్కడే లాయర్లుగా పనిచేస్తున్న భార్యాభర్తలు షికా సర్మదాన్, షాహుల్ హమీద్ లు వేగంగా టేకోవర్ చేశారు. అనంతరం తమ కారును జడ్జీ వాహనానికి అడ్డంగా నిలిపేసి డ్రైవర్ ను దూషించారు. అక్కడితో ఆగిపోకుండా మరుసటి రోజు జడ్జీ నివాసానికి వచ్చి మరోసారి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు.

ఈ ఘటనపై జడ్జీ వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్ వో) ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లాయర్ దంపతుల వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు బార్ కౌన్సిల్.. వీరిద్దరి లైసెన్స్ లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 15 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అడ్వోకేట్స్ చట్టం-1961 సెక్షన్ 42 ప్రకారం వీరిద్దరూ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది. లైసెన్సులు రద్దు కావడంతో వీరిద్దరూ దేశంలోని ఏ కోర్టులలోనూ వాదించడానికి అర్హత లేదని స్పష్టం  చేసింది.

More Telugu News