Kashmir Editor: ఉగ్రవాది అంత్యక్రియల్లో పాల్గొన్న షుజాత్ బుఖారీ హంతకుడు.. మరణించిన మిత్రుడికి ‘గన్ శాల్యూట్’!

  • కశ్మీర్‌లో సరికొత్త ట్రెండ్
  • ఉగ్రవాదుల అత్యంతక్రియలకు హాజరవుతున్న ఉగ్రవాదులు
  • నవీద్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్

'రైజింగ్ కశ్మీర్' పత్రిక సంపాదకుడు షుజాత్ బుఖారీని కాల్చి చంపిన పాకిస్థాన్ ఉగ్రవాది నవీద్ జట్ తాజాగా ఓ ఉగ్రవాది అంత్యక్రియల్లో కనిపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీనగర్ ఆసుపత్రి నుంచి తప్పించుకుపారిపోయిన నవీద్ సోఫియాన్ జిల్లాలో జరిగిన ఓ ఉగ్రవాది అంత్యక్రియలకు హాజరయ్యాడు. సోఫియాన్ జిల్లాలో 12 గంటలపాటు జరిగిన సుదీర్ఘ ఆర్మీ ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు  హతమయ్యారు. లష్కరే తాయిబా (ఎల్‌ఈటీ), అల్ -బదర్, హిజ్బుల్ ముజాహిదీన్ చెందిన వీరిని భద్రతా సిబ్బంది హతమార్చారు.

వీరిలో వకార్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాది కూడా ఉన్నాడు. మాలిక్‌గుండ్ గ్రామంలో వకార్ అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి హాజరైన 20 ఏళ్ల నవీద్.. వకార్‌కు తుపాకితో నివాళులర్పించాడు. ఏకే-47 పట్టుకుని నివాళులర్పిస్తున్న నవీద్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.  

ఇటీవల కశ్మీర్‌లో ఓ ట్రెండ్ నడుస్తోంది. భద్రతా దళాల చేతుల్లో హతమైన ఉగ్రవాదులకు నిర్వహించే అంత్యక్రియల్లో ఉగ్రవాదులు పాల్గొనడం ఫ్యాషన్‌గా మారింది. తుపాకులతో హాజరై ‘గన్ శాల్యూట్’ అర్పిస్తూ ఉగ్రవాదులను హీరోలుగా మారుస్తున్నారు. 2016 నుంచి శ్రీనగర్ సెంట్రల్ జైలులో ఉన్న నవీద్‌ను ఆసుపత్రికి తరలించే క్రమంలో ఓ గన్‌మెన్ ఇద్దరు పోలీసులను చంపి నవీద్‌ను తప్పించాడు. లష్కరే చీఫ్ జకీ-ఉర్- రెహ్మాన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన నవీద్ ఆసుపత్రి నుంచి తప్పించుకున్న తర్వాత జూన్ 14న రైజింగ్ కశ్మీర్ పత్రిక ఎడిటర్‌ షుజాత్ బుఖారీని కాల్చి చంపాడు.  

More Telugu News