Jodhpur: బిచ్చగత్తె ఒడిలో అందాల పసిపాప... అసలు విషయాన్ని తేల్చిన పోలీసులు!

  • పిల్లల కిడ్నాపర్ అంటూ వైరల్
  • రంగంలోకి దిగి మహిళను గుర్తించిన జోధ్ పూర్ పోలీసులు
  • పక్కింటి వారి బిడ్డని తేల్చిన పోలీసులు

ఒక్క ఫొటో ఒక్కోసారి ఎంతటి కంగారు పెట్టిస్తుందో తెలిపే ఉదంతం ఇది. యూఎస్ లో ఉంటున్న ఓ భారత మహిళ చేసిన పని ఓ పేద మహిళకు చిక్కులు తెచ్చిపెట్టడమే కాకుండా పోలీసులను పరుగులు పెట్టించింది. తనకు సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ ఫొటోను ఆ మహిళ షేర్ చేసుకుంటూ, దీని సంగతేంటో తేల్చాలని వ్యాఖ్యానించగా, అది వైరల్ అయింది. ఈ ఫొటోలో ఓ ఆలయం ముందు బిచ్చమెత్తుకుంటున్న ఓ మహిళ ఒడిలో తెల్లగా, అందంగా ఉన్న ఓ పసిపాప ఉంది. జోధ్ పూర్ లోని శనీశ్వరుని ఆలయం వెలుపల రెండు వారాల క్రితం డైపర్ ధరించి ఉన్న ఓ బిడ్డను మాసిపోయిన దుస్తులతో ఉన్న మహిళ ఒడిలో చూసిన ఓ వ్యక్తి ఈ ఫొటో తీశాడు. ఆమె పిల్లల కిడ్నాపరని, పిల్లలను ఎత్తుకుపోయే స్త్రీ అని, పలువురు సామాజిక మాధ్యమాల్లో అనుమానం వ్యక్తం చేస్తూ, ఫొటోను షేర్ చేస్తుండటంతో పోలీసులు రంగంలోకి దిగి నిజాన్ని తేల్చారు.

ఈ ఫొటో వైరల్ అవుతూ ఉండటంతో జరగరానిది జరిగేలోగానే ఆమెను గుర్తించాలని నిర్ణయించిన పోలీసులు, శనీశ్వరుని గుడి ముందు ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. ఆపై విచారించగా, ఆమె యాచకురాలని, దేవాలయం పొరుగున ఉండే మహిళ ఆ బిడ్డను కాసేపు చూస్తుండమని చెప్పి చేతుల్లో పెట్టి వెళ్లిందని, అంతలోనే ఈ ఫొటోను తీశారని జోధ్ పూర్ డీసీపీ అమన్ దీప్ సింగ్ వెల్లడించారు. పొరుగింటి మహిళను కూడా విచారించామని, బిడ్డ జన్మించిన ఆసుపత్రి రికార్డులను, డైపర్ కొనుగోలు చేసిన దుకాణం యజమానిని విచారించి, దర్యాఫ్తుతో తృప్తి చెందామని, అందరినీ వదిలేశామని తెలిపారు.

More Telugu News