No confidence Motion: మూడు నెలల రాహుల్ గాంధీ ప్లాన్ ఫలితమే ఆ కౌగిలింత!: కాంగ్రెస్ వర్గాలు వెల్లడించిన వాస్తవం

  • అవిశ్వాస తీర్మానం తరువాత మోదీకి రాహుల్ కౌగిలింత
  • దేశవ్యాప్తంగా పతాక శీర్షికల్లో ఇరు నేతల హగ్
  • ఎంతో ప్రణాళికతో, పక్కా టైమింగ్ తో రాహుల్ కౌగిలించుకున్నారన్న కాంగ్రెస్ నేత

గత వారంలో కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పెట్టిన అవిశ్వాస తీర్మానంపై సాగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ప్రసంగం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి, ఆయన్ను ఆలింగనం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ కౌగిలింత అనుకోకుండానో లేక యాదృచ్చికంగానో జరిగింది కాదని, మూడు నెలల పాటు ప్లాన్ చేసిన ఘటనని సోనియా గాంధీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దేశమంతా గుర్తించేలా ఏదైనా పనిచేయాలని, అందులో ప్రధానిని కూడా భాగం చేయాలని ఆయన ఆలోచించి, ఈ పని చేశారని ఓ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.

గాంధీ కుటుంబాన్ని, ముఖ్యంగా తన తల్లిని పదే పదే విమర్శిస్తున్న ప్రధానికి రాహుల్ గాంధీ ఈ విధంగా తన నిరసన తెలిపారని ఆయన అన్నారు. ఆయన తన ఆలింగనం ద్వారా ప్రధానిని ఆశ్చర్యపోయేటట్టు చేశారని అందరూ భావిస్తున్నారని, కానీ ఈ విషయంలో రాహుల్ టైమింగ్ మాత్రం ప్రధానితో తలపడటాన్నే సూచిస్తోందని ఆయన అన్నారు. వాస్తవానికి ప్రధాని మాట్లాడే సమయంలోనో లేదా తన ప్రసంగం మధ్యలోనో ఈ కౌగిలింతను ఇవ్వాలని ఆయన భావించారని, చివరకు తన ప్రసంగం ముగిసిన తరువాతే సరైన సమయమన్న భావనకు రాహుల్ వచ్చారని తెలిపారు.

More Telugu News