USA: 21 మంది ఎన్నారైలకు జైలు శిక్ష విధించిన అమెరికా

  • సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ కుంభకోణం
  • నాలుగేళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ జైలు
  • శిక్ష పూర్తయిన తరువాత భారత్ కు డిపోర్ట్

యూఎస్ లో సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ కుంభకోణంలో దోషులుగా నిరూపితులైన 21 మందికి కనిష్ఠంగా నాలుగేళ్ల నుంచి గరిష్ఠంగా 20 ఏళ్ల వరకూ జైలు శిక్షను విధిస్తూ అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గతంలో ముగ్గురికి శిక్షపడిన సంగతి తెలిసిందే. వేలాదిమంది అమాయకులను మోసం చేసి కోట్ల డాలర్లను కాజేసిన కేసులో మొత్తం 32 మందిని నిందితులుగా అమెరికా పోలీసులు నమోదు చేశారు. ఇదే కేసులో ఇండియాలో ఉంటున్న 32 మంది నిందితులుగా ఉండగా, ఐదు కాల్ సెంటర్లపై కేసులు ఉన్నాయి. వీరిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు.

కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన యూఎస్ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్, చట్టబద్ధంగా ఉంటున్న వలసదారులు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని కాజేయాలని వీరు చూశారని, అమాయకులు, వృద్ధులను మోసం చేసేవారిపై పోరాటంలో తాము కీలక విజయం సాధించామని అన్నారు. ఈ తరహా మోసాలను అరికట్టి, నేరగాళ్లను జైలుకు పంపేందుకు అమెరికా కృషి చేస్తుందని తెలిపారు.

కాగా, 2012 నుంచి 2016 వరకూ ఈ దందా సాగింది. అమెరికాలోని వ్యక్తుల సమాచారం సేకరించి, వృద్ధులు, వలసదారులను ఎంపిక చేసుకుని, అహ్మదాబాద్, ముంబైలో ఏర్పాటు చేసుకున్న కాల్ సెంటర్ల నుంచి ఫోన్ చేస్తారు. తాము అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం లేదా అంతర్గత ఆదాయ విభాగం అధికారులమని చెప్పి నమ్మించి, వారు ప్రభుత్వానికి డబ్బు బాకీ పడ్డారని, అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. దీంతో భయపడే బాధితుల నుంచి ఆన్ లైన్ లో మనీ ట్రాన్స్ ఫర్ చేయించుకుంటారు. ఈ వ్యవహారం గత సంవత్సరం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. దోషులకు శిక్ష ముగిసిన తరువాత వారిని భారత్ కు డిపోర్ట్ చేస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News