Lok Sabha: అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే... ప్రస్తుత బలాబలాలివి!

  • రేపు లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ
  • ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదంటున్న రాజకీయ పరిశీలకులు 
  • అనుకూలంగా వచ్చేది 141 ఓట్లు మాత్రమే

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసేందుకు తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు లోక్ సభలో చర్చ జరగనుండగా, ఓటింగ్ జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న సమీకరణాలు మరోసారి తెరపైకి వచ్చాయి. దాదాపు 15 సంవత్సరాలకు ముందు వాజ్ పేయి ప్రధానిగా ఉన్న వేళ, బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని  ఎదుర్కొని ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడా పరిస్థితి లేనప్పటికీ, ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియని పరిస్థితి నెలకొని కొంత ఉత్కంఠను రేకెత్తిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొత్తం 545 మంది సభ్యులున్న లోక్ సభలో ప్రస్తుతం 9 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే, ఓటు హక్కు కలిగిన సభ్యులు 534 మంది. ప్రస్తుత సంఖ్య ప్రకారం, ప్రభుత్వం కొనసాగాలంటే, 268 మంది సభ్యుల బలం చాలు. ఒక్క బీజేపీకే సభలో 271 మంది సభ్యుల బలం ఉండటంతో అవిశ్వాసం గురించిన దిగులు ఆ పార్టీలో లేదనే చెప్పొచ్చు. ఇక అవసరమైతే ఎన్డీయే కూటమిలోని పార్టీలు ఎలాగూ ఉన్నాయి. మొత్తం ఎన్డీయే కూటమి బలం 314గా ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ప్రతిపక్ష యూపీఏ మొత్తం బలం 66 మాత్రమే. దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలేవీ ఇప్పుడు ఏ కూటమిలోనూ లేకపోవడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకూ తూర్పు తీర ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉండగా, అవేవీ అటు ఎన్డీయేలోగానీ, ఇటు యూపీఏలోగానీ లేవు. ఏ కూటమిలోనూ లేని పార్టీల బలం 154గా ఉంది. తెలుగుదేశం వంటి పార్టీలు ఓటింగ్ జరిగితే ఎలానూ ఎన్డీయేకు వ్యతిరేకంగానే ఓటేస్తాయి.

అవిశ్వాసం తీర్మానం విషయానికి వస్తే, సభ్యులంతా సభకు హాజరైన పక్షంలో వ్యతిరేకంగా 313 (స్పీకర్ మినహా), అనుకూలంగా 141 ఓట్లు ఖాయంగా తెలుస్తోంది. ఎటూ తేల్చని పార్టీల ఎంపీల సంఖ్య 80. వీరంతా అనుకూలంగా ఓటేసినా ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ లేదు.

బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే పార్టీల బలాబలాలు పరిశీలిస్తే, యూపీఏ 66, టీఎంసీ 34, టీడీపీ 17, సీపీఎం 9, సీపీఐ 1, సమాజ్ వాదీ 7, ఆప్ నలుగురు సభ్యులతో పాటు పీడీపీ, ఎంఐఎం వంటి పార్టీలూ కలసి వస్తాయి. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్, ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్, తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే ఇంకా ఎటూ తేల్చుకోని పార్టీల జాబితాలో ఉన్నాయి.

More Telugu News