Kancheepuram Central Cooperative Bank: ఒక్క రూపాయి తగ్గిందంటూ.. కుదువ పెట్టిన బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన బ్యాంకు!

  • కాంచీపురం సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు నిర్వాకం
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధితుడు
  • అసలు నగలు ఉన్నాయా? లేవా? అంటూ అనుమానం

బంగారాన్ని తాకట్టు పెట్టిన వినియోగదారుడికి చుక్కలు చూపించింది తమిళనాడులోని కాంచీపురం సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు. వివరాల్లోకి వెళ్తే, సి.కుమార్ అనే వ్యక్తి 2010 ఏప్రిల్ 6న 131 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 1.23 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత మరో రెండు సార్లు 138 గ్రాముల బంగారాన్ని పెట్టి రూ. 1.65 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. 2011 మార్చిలో తొలి లోనుకు సంబంధించిన మొత్తాన్ని తిరిగి చెల్లించి నగలను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే డబ్బును చెల్లించి కొత్త రెండు లోన్లను కూడా క్లియర్ చేశాడు. కానీ రెండు లోన్లకు సంబంధించి ఒక్కో రూపాయి చొప్పున బకాయి ఉందనే కారణం చెబుతూ... నగలను ఇవ్వడానికి బ్యాంకు నిరాకరించింది.

ఈ నేపథ్యంలో, బాధితుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గత ఐదేళ్లుగా తన నగలను ఇవ్వకుండా బ్యాంకు సిబ్బంది తనను వేదనకు గురి చేస్తున్నారంటూ పిటిషన్ లో తెలిపాడు. పిటిషన్ విచారణ సందర్భంగా బాధితుడి తరపు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, తన క్లయింట్ కు నగలను బ్యాంకు తిరిగి ఇవ్వడం లేదని... పెండింగ్ ఉన్న రెండు రూపాయలను తీసుకోవడానికి కూడా నిరాకరిస్తోందని తెలిపారు. అంతేకాదు, తన క్లయింటు నగలు అసలు బ్యాంకులో ఉన్నాయా? లేవా? అనే అనుమానాన్ని కూడా లేవనెత్తారు. వాదనలను విన్న జస్టిస్ టి.రాజా, రెండు వారాల్లోగా సంబంధిత అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి, సమర్పించాల్సిందిగా ప్రభుత్వ అడ్వొకేట్ కు ఆదేశాలు జారీ చేశారు. 

More Telugu News