Karnataka: వచ్చే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ నన్నెవరూ కదిలించలేరు: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • మా సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగా పని చేస్తుంది
  • ఒక ఏడాది పాటు నన్ను ఎవరూ కదిలించలేరు
  • రైతులకు రుణమాఫీ హామీకి కట్టుబడి ఉన్నా
  • జులై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పొత్తుతో నడుస్తున్న ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందనే విషయమై అనుమానాలు తలెత్తుతుండటంపై సీఎం కుమారస్వామి స్పందించారు. ‘2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు నన్ను ఎవరూ కదిలించ లేరు. మా సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగా పని చేస్తుంది. ఒక ఏడాది పాటు నన్ను ఎవరూ కదిలించలేరనే విషయం నాకు తెలుసు. కనీసం ఒక ఏడాది వరకు నేను ఉంటాను, అంటే లోక్ సభ ఎన్నికల వరకు అయ్యేవరకు.  అప్పటివరకు, ఎవరూ నన్ను ఏమీ చేయలేరు’ అని ఘంటాపథంగా చెప్పారు.

‘సీఎం అయ్యే అవకాశం పొందిన నేను, ఇతరులు ఏం చేశారనే దానిపై దృష్టి పెట్టడం కన్నా.. నేను ఏం చేశాను అనేదే చూపిస్తాను. ఈ క్రమంలో మంచి వర్షాలతో వాతావరణం కూడా నాకు సహకరిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే మంచి నిర్ణయాలను తీసుకుంటా’ అన్నారు. ‘రైతులకు రుణమాఫీ విషయమై ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నా. రుణమాఫీ ద్వారా ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరేలా చూస్తున్నా. ఈ విషయమై త్వరలోనే ఓ ప్రకటన చేస్తా’ అని తన ట్విట్టర్ లో కుమారస్వామి పేర్కొన్నారు.

జులై మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని కుమారస్వామి చెప్పారు. 'సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నడుస్తోంది కదా? అని అంటున్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడితే నాకు ఎక్కడ పేరు వస్తుందోనని కొంతమంది బాధపడుతున్నారు' అంటూ కుమారస్వామి విమర్శించారు.

More Telugu News