gold prices: వచ్చే దీపావళి నాటికి రూ.34,000కు బంగారం!: విశ్లేషకుల అంచనాలు

  • క్షీణిస్తున్న రూపాయి విలువతో ధరలకు రెక్కలు
  • దిగుమతులపై మరింత వెచ్చించాల్సిన అవసరం
  • రూ.32,000 స్థాయిలో ఉండొచ్చన్న విశ్లేషణలు

బంగారం ధరలు ఈ ఏడాది పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తులం బంగారం ఈ ఏడాది దీపావళి నాటికి రూ.34,000 వరకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులకు తోడు తగ్గిపోతున్న రూపాయి విలువను వారు కారణాలుగా పేర్కొంటున్నారు. మనకు కావాల్సిన బంగారం కోసం దిగుమతులపైనే ఆధాపడుతున్న విషయం తెలిసిందే. డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో డాలర్ తో రూపాయి మారకం విలువ 75.50 వరకు పడిపోయింది. తగ్గిన మేర బంగారం ధర పెరిగే అవకాశాలుంటాయి.

‘‘దీపావళి వరకు తులం బంగారం ధర రూ.30,000-34,000 మధ్యే ఉండొచ్చు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం 1,260-1,400 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది’’ అని కామ్ ట్రెండ్జ్ రిస్క్ నిర్వహణ డైరెక్టర్  జ్ఞానశేఖర్ త్యాగరాజన్ తెలిపారు. అమెరికాలో వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ రేట్ల పెంపు వల్ల ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగి హెడ్జ్ కోసం బంగారంలోకి పెట్టుబడులు తరలి వెళ్లే అవకాశం ఉందని, దాంతో ధరలు పెరగొచ్చని త్యాగరాజన్ విశ్లేషణ. అయితే, కమోడిటీ అండ్ కరెన్సీ సంస్థ ఎండీ ప్రీతి రాతి మాత్రం దీపావళికి తులం బంగారం ధర రూ.31,500-31,800 స్థాయిలో ఉండొచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. జూన్ 8న బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.31,010గా ఉంది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ ధర 1,302.70 డాలర్లుగా ఉంది.

More Telugu News