amalapuram: మనపై ఎవరైనా కుట్రలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు: సీఎం చంద్రబాబు

  • కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసింది
  • కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధి ఆగదు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పోరాడుతున్నాం

మనపై ఎవరైనా కుట్రలు చేస్తే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ముప్పై ఆరు యువ జంటలకు ‘చంద్రన్న కానుక’ను చంద్రబాబు అందజేశారు.

అనంతరం, చంద్రబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని, కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధి ఆగదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కు ఖర్చు చేసిన రూ.3,500 కోట్లు కేంద్రం ఇంకా ఇవ్వలేదని, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు మనల్నే డబ్బు ఖర్చు పెట్టమని కేంద్ర ప్రభుత్వం అంటోందని చెప్పారు. మన రాష్ట్రం నుంచి గ్యాస్ తీసుకెళుతున్న కేంద్రం, మనకు నిధులు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు.

రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు ఇచ్చామని, రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్నామని, కాపులు, బ్రాహ్మణులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అదేవిధంగా, వైశ్యులకు కూడా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.60 కోట్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అగ్రవర్ణాల పేదలకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకెళ్తున్నామని, పేదలందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకున్నామని అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో పోరాడుతున్నామని  మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. బీజేపీతో విభేదించిన తర్వాతే తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయని, జీఎస్టీ వల్ల ఆశించిన ఫలితాలు చేకూరడం లేదని విమర్శించారు.

More Telugu News