CRPF: అట్టుడుకుతున్న కశ్మీర్... మూడు గ్రనేడ్ దాడులు, సరిహద్దుల వద్ద ఫైరింగ్ లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి!

  • సీఆర్పీఎఫ్ వాహనం ఢీకొని నిరసనకారుడు మృతి
  • నిరసనలు, ధర్నాలకు దిగిన యువత
  • గ్రనేడ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు
  • కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

నిరసనకారుల రాళ్ల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్న వాహనం ముగ్గురిని ఢీకొట్టగా, వారిలో ఒకరు చనిపోవడంతో కశ్మీర్ అట్టుడుకుతోంది. వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతుండగా, మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు గ్రనేడ్ దాడులకు దిగారు. గ్రనేడ్లు పేలి ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారని తెలుస్తోంది. మరో చోట కూడా బాంబు పేలుడు శబ్దం వినిపించినప్పటికీ, అది ఓ వాహనం టైర్ పేలిన శబ్దంగా భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.

యువకుడి మృతికి సైనికులే కారణమంటూ, పెద్దఎత్తున యువత ధర్నాలకు దిగుతుండటం, శ్రీనగర్ ప్రాంతంలో మళ్లీ అల్లర్లు చెలరేగుతుండటంతో, పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు లోయలో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఇదిలావుండగా, రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణకు కట్టుబడి వుందామని సలహాలు ఇచ్చిన పాక్, సరిహద్దుల్లో భారత జవాన్లు లక్ష్యంగా కాల్పులు జరిపింది. అక్నూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు. ఎటువంటి కవ్వింపు చర్యలూ లేకుండానే పాక్ కాల్పులకు తెగబడిందని సైన్యాధికారి ఒకరు ఆరోపించారు.

More Telugu News