Karnataka: మోదీ.. ఇక కాసుకో.. విపక్షాల మూకుమ్మడి హెచ్చరిక!

  • ప్రమాణ స్వీకార వేదిక పైనుంచి బీజేపీకి హెచ్చరికలు
  • ప్రాంతీయ పార్టీలతో పెట్టుకుంటే మసైపోతారన్న నేతలు
  • కర్ణాటక పరిణామాలు బీజేపీకి గుణపాఠం కావాలని వ్యాఖ్య

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వేళ బీజేపీకి, ప్రధాని మోదీకి విపక్ష నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాణ స్వీకారానికి వచ్చిన దేశంలోని వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులతో వేదిక కళకళలాడింది. మరోవైపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ విపక్ష నేతలందరూ దగ్గరవుతుండడం బీజేపీకి మింగుడుపడడం లేదు.  

ప్రమాణ స్వీకారం అనంతరం విపక్ష నేతలు మాట్లాడుతూ బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తూ, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న ప్రధాని మోదీ పతనం కర్ణాటక నుంచే ప్రారంభమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించగా, బీజేపీ ఆటలు ఇక సాగవని మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌‌లు పేర్కొన్నారు. విభేదాలను, అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి విపక్షాలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. కర్ణాటక రాజకీయ పరిణామాలు బీజేపీకి గుణపాఠం కావాలన్నారు. ప్రాంతీయ పార్టీలతో పెట్టుకుంటే మాడిమసైపోతారని ఏపీ, పశ్చిమబెంగాల్  సీఎంలు చంద్రబాబు, మమతా బెనర్జీలు బీజేపీని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.  

ప్రమాణ స్వీకారోత్సవానికి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి సీఎంలు.. నారా చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు. అలాగే, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, సీపీఐ నేత పి.రాజా, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్ సింగ్, ఎస్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ తరలి రావడంతో వేదిక కళకళలాడింది.

More Telugu News