Karnataka: అంతా సిద్ధరామయ్యే చేశారు.. మమ్మల్ని ఓడించారు!: తిరగబడుతున్న సొంత పార్టీ నేతలు

  • సిద్ధరామయ్యపై ముప్పేట దాడి
  • కావాలనే తమను ఓడించారంటున్న నేతలు
  • ఆయనకేమైనా పదవులిస్తే కాంగ్రెస్ పని ఖతం

కర్ణాటక తాజా మాజీ సీఎం సిద్ధరామయ్యపై సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. తమ ఓటమికి స్వయంగా ఆయనే కారణమంటూ ముప్పేట దాడికి దిగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి ముమ్మాటికీ ఆయనే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ స్పీకర్ కేబీ కోళివాడ సిద్ధరామయ్యపై నిప్పులు చెరిగారు. ఆయన కావాలనే తనను ఓడించారని ఆరోపించారు. తన సొంత సామాజిక వర్గానికి చెందిన శంకర్‌ను, కేపీజేపీ అనే చిన్న పార్టీ తరఫున పోటీకి నిలబెట్టి తనను ఓడించారని అన్నారు. అందుకే సిద్ధూ తన కోసం ప్రచారం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే కాదని, చాలామంది నేతల ఓటమికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు.

సిద్ధరామయ్యకు ఏవైనా పదవులు అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓటమిని తానే కొనితెచ్చుకున్నట్టు అవుతుందని కోళివాడ పేర్కొన్నారు. కాంగ్రెస్ సహా ఒక్కలిగ, లింగాయత్ సామాజిక వర్గాలకు సిద్ధూ అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సిద్ధరామయ్య రక్తంలో ఒక్క బొట్టు కూడా కాంగ్రెస్ రక్తం లేదన్నారు. హొళెనరసీపురలో దేవెగౌడ కుమారుడు రేవణ్ణ చేతిలో పరాజయం పాలైన కాంగ్రెస్ నేత మంజేగౌడ కూడా తన ఓటమికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు. వద్దువద్దంటున్నా బలవంతంగా రేవణ్ణపై పోటీకి దింపారని మంజేగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News