Donald Trump: జెరూసలెంకు అమెరికా ఎంబసీ.. గాజా సరిహద్దుల్లో ఆందోళనలు.. 40 మంది మృతి, వెయ్యి మందికి గాయాలు

  • గతేడాది జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించిన ట్రంప్‌
  • మధ్యప్రాచ్యంలో మరో తేనెతుట్టను కదిలించినట్టు అమెరికా చర్య
  • మిన్నంటిన నిరసన జ్వాలలు
  • పాలస్తీనీయులపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకర కాల్పులు

జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, జెరూసలెంను రాజధానిగా గుర్తించడమనేది తమ వద్ద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశమని ఆ సందర్భంగా ట్రంప్‌ అన్నారు. కాగా, ఈ రోజు జెరూసలెంకు అమెరికా తన ఎంబసీని తరలిస్తోంది. అయితే, ఈ చర్యను వ్యతిరేకిస్తూ గాజా సరిహద్దులో ఆందోళనలు మిన్నంటాయి.

సరిహద్దు కంచెను తొలగించేందుకు పాలస్తీనీయులు ప్రయత్నించడంతో ఆందోళన కారులపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకరంగా కాల్పులు జరిపింది. దీంతో సుమారు 40 మంది నిరసన కారులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. ట్రంప్‌ చర్య మధ్యప్రాచ్యంలో మరో తేనెతుట్టను కదిలించినట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు.          

కాగా, 1967లో జరిగిన యుద్ధం తరువాత తూర్పు జెరూసలెంను జోర్డాన్‌ దేశం నుంచి ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుంది. అనంతరం అవిభాజ్య జెరూసలెంను ఇజ్రాయెల్ తమ రాజధానిగా భావిస్తూ వస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు జెరూసలెంను ఆ దేశ రాజధానిగా గుర్తించలేదు. మరోవైపు పాలస్తీనీయులు తూర్పు జెరూసలెంను తమ ప్రతిపాదిత దేశానికి రాజధానిగా భావిస్తుండడంతో సుదీర్ఘకాలంగా ఈ ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి.    

More Telugu News