Tripura: తూచ్! నేనలా అనలేదు.. అంటూనే మరోసారి అవే వ్యాఖ్యలు చేసిన విప్లవ్ దేవ్

  • మెకానికల్ ఇంజినీర్లు సివిల్స్‌కు పనికిరారని అన్లేదు
  • సివిల్ ఇంజీనీర్లకు అనుభవం బాగా ఎక్కువ ఉంటుందని మాత్రమే అన్నా
  • విమర్శలు వెల్లువెత్తడంతో త్రిపుర సీఎం వివరణ

ఇటీవల ఎవరైనా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఉన్నారూ.. అంటే అది త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ మాత్రమే. రోజుకో వివాదాస్పద ప్రకటనతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి. గతంలో ఓసారి మాట్లాడుతూ మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉందని, ఇప్పుడు ఉండడం పెద్ద గొప్ప కాదని అన్నారు. ఆ తర్వాత ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం ప్రపంచ సుందరిగా ఎన్నికైన డయాన హైడెన్‌ను పట్టుకుని ఆమెకెలా ఆ కిరీటం ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండు రోజుల క్రితం ‘సివిల్స్ డే’ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మెకానికల్ ఇంజినీర్లు సివిల్స్ పరీక్ష రాయకూడదని, అది రాసేందుకు సివిల్ ఇంజినీర్లే అర్హులంటూ సంచలన కామెంట్ చేశారు. అక్కడితో ఆగక.. వారికి బ్రహ్మాండమైన నిర్వహణ శక్తి ఉంటుందని, ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకుంటారు కాబట్టి దేశ సేవ కూడా చేయగలరని కితాబిచ్చారు.

ఆదివారం మరో కార్యక్రమంలో మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరగడం మాని ఆవులు, పందులు, కోళ్లు పెంచుకోవాలని, లేదంటే పాన్ షాపు పెట్టుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.

విప్లవ్ దేవ్ సివిల్స్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా ఆయన స్పందించారు. అబ్బే.. తానేమీ అలా అనలేదని, పొరపాటున అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. మెకానికల్ ఇంజినీర్లు సివిల్స్‌కు పనికిరారని తానెప్పుడూ చెప్పలేదన్నారు. అయితే సివిల్ ఇంజినీర్లు మాత్రం దానికి అర్హులేనంటూ మరోమారు అవే వ్యాఖ్యలు చేశారు. సివిల్ ఇంజినీర్లకు ఉన్న అనుభవం వల్లే తానా వ్యాఖ్యలు చేసినట్టు వివరణ ఇచ్చారు.

More Telugu News