Shoe Doctor: ఆ 'షూ డాక్టర్'ను కనుగొన్నాం... డబ్బిస్తామంటే వద్దన్నాడు: ఆనంద్ మహీంద్రా

  • 'గాయపడిన బూట్ల ఆసుపత్రి' అంటూ చెప్పుల దుకాణం
  • ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా
  • అతన్ని హర్యానాలో గుర్తించిన మహీంద్రా టీమ్
  • మంచి కియాస్క్ ఏర్పాటు చేయించనున్నట్టు వెల్లడి

"గాయపడిన బూట్ల ఆసుపత్రి" అన్న పోస్టర్ ముందు చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తి చిరునామాను తన టీమ్ కనుగొందని, అతనికి డబ్బిస్తామంటే వద్దని తిరస్కరించాడని బిలియనీర్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన రెండు వారాల క్రితం తన ట్విట్టర్ లో ఓ పోస్టును పెడుతూ, ఈ 'షూ డాక్టర్' ఎక్కడి వ్యక్తో తెలియజేస్తే సాయం చేస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత తన టీమ్ ను పంపి వెతికించగా, హర్యానాలో ఉన్న నర్సీరామ్ అనే వ్యక్తిని గుర్తించారు. ఎంతో నిరాడంబరంగా ఉన్న ఆ వ్యక్తి డబ్బులు వద్దంటూ, తనకు ఓ మంచి షాప్ కావాలని కోరాడని, ఆపై తాను ముంబైలోని తన డిజైన్ స్టూడియో టీమ్ ను మంచి కియాస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించానని అన్నారు.
గాయపడిన బూట్ల ఆసుపత్రి - డాక్టర్‌ నర్సీరామ్‌. ఓపీడీ సమయం: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు
భోజన విరామం: మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆస్పత్రి తెరిచి ఉంటుంది
అన్ని రకాల బూట్లకు జర్మన్ టెక్నాలజీతో చికిత్స చేయబడును.
అని రాసున్న ప్లెక్సీ కింద నర్సీరామ్ చెప్పుల దుకాణాన్ని నడుపుకుంటుండగా, అతనికి ఐఐఎం విద్యార్థులకు పాఠాలు చెప్పే సత్తా ఉందని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు.

More Telugu News