Poonam Yadav: గోల్డ్ మెడల్ సాధించిన పూనమ్ యాదవ్ కు ఇండియాలో తీవ్ర అవమానం... కాశీలో రాళ్లు, ఇటుకలతో దాడి!

  • బంధువుల ఇంటికి వచ్చిన పూనమ్ యాదవ్
  • ఓ స్థల వివాదంలో ఘర్షణ
  • దాడి విషయం తెలిసి భద్రత పెంచిన పోలీసులు
  • నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న వారణాసి ఎస్పీ

ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ పోటీల్లో స్వర్ణం సాధించిన పూనమ్ యాదవ్ కు స్వదేశంలో తీవ్ర అవమానం జరిగింది. శనివారం నాడు ఆమె తన బంధువులను కలుసుకునేందుకు వారణాసికి రాగా, గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆమెపై రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. పూనమ్ పై దాడిని అడ్డుకునేందుకు ఆమె తండ్రి, మామయ్య ప్రయత్నించగా, వారిపైనా రాళ్లు రువ్వారు.

ఈ ఘటనపై వారణాసి ఎస్పీ అమిత్ కుమార్ స్పందిస్తూ, దాడి ఘటన తమకు తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామని, పూనమ్ ను కాపాడి క్షేమంగా పంపించామని తెలిపారు. దాడి చేసింది ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, నిందితులను వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. పూనమ్ బంధువులకు వారణాసిలో ఉన్న ఓ స్థలానికి సంబంధించి కొందరితో వివాదం నడుస్తోందని, ఈ కారణంతోనే ఘటన జరిగి ఉండవచ్చని అన్నారు.

ఆ వివాదంలో ఆమె కల్పించుకోవాలని భావించడంతోనే ప్రత్యర్థులు దాడి చేసి ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ దాడిలో పూనమ్ కు స్వల్ప గాయాలు అయ్యాయని, ఆమెకు భద్రత కల్పించామని తెలిపారు. కాగా, పూనమ్ 69 కేజీల విభాగంలో పోటీపడి స్నాచ్ లో 100 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 122 కిలోలు ఎత్తి స్వర్ణ పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News