India: దుమ్మురేపిన ఇండియన్స్... కామన్వెల్త్ లో ఒకే రోజు ఎనిమిది స్వర్ణాలు!

  • అద్భుత ఆటతీరుతో చెలరేగిన భారత క్రీడాకారులు
  • చరిత్ర సృష్టించిన మనికా బాత్రా, మేరీ కోమ్
  • తెలుగుతేజం సిక్కిరెడ్డికి కాంస్యం
  • 25కు పెరిగిన స్వర్ణాలు

గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీల్లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ, క్రీడల 9వ రోజున ఏకంగా ఎనిమిది స్వర్ణాలు సహా 17 పతకాలు సాధించారు. మేరీకోమ్, మనికా, నీరజ్ తదితరులు చరిత్ర సృష్టిస్తూ, తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచారు. బాక్సింగ్ లో మేరీకోమ్, అథ్లెటిక్స్ లో నీరజ్ చోప్రా, టీటీలో మనికా బాత్రా స్వర్ణాలు గెలవగా, తెలుగుతేజం సిక్కిరెడ్డి బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం గెలుచుకుంది. రెజ్లింగ్ విభాగంలో రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు రాగా, స్క్వాష్ లో ఓ రజతం లభించింది.

షూటింగ్ విభాగంలో పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్ ఫైనల్ లో సంజీవ్ రాజ్ పుత్ 454.5 పాయింట్లతో స్వర్ణం సాధించాడు. ఒలింపియన్ గగన్ నారంగ్ రికార్డును రాజ్ పుత్ తిరగరాయడం గమనార్హం. బాక్సింగ్ లో మేరీకోమ్ తో పాటు 52 కిలోల విభాగంలో గౌరవ్ సోలంకి, 75 కిలోల విభాగంలో వికాస్ కిషన్ లకు స్వర్ణాలు లభించాయి. బాక్సింగ్ విభాగంలో 2010లో గెలిచిన పతకాల కన్నా రెండు పతకాలను అదనంగా భారత్ కైవసం చేసుకుంది. మొత్తం మీద భారత్ 25 స్వర్ణాలు, 16 రజతాలు, 18 కాంస్యాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పోటీలు నేటితో ముగియనున్నాయి.

More Telugu News