YSRCP: జగన్ అభిమానులను పోలీసులు కొడుతున్నారంటూ నకిలీ వీడియో సృష్టి.. కేసు నమోదు!

  • వైసీపీ అభిమానులను పోలీసులు కొడుతున్నారంటూ అసత్య ప్రచారం
  • క్షణాల్లోనే వైరల్ అయిన వీడియో
  • నకిలీదని తేల్చిన పోలీసులు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా శనివారం హల్‌చల్ చేసిన నకిలీ వీడియోను షేర్‌చేసిన వారిపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరెవరి ఫోన్ల నుంచి ఈ వీడియో షేర్ అయిందన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.

జగన్ పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించగానే బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను పోలీసులు లాఠీలతో కొడుతున్నట్టున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది. ‘పాదయాత్రలో జగన్‌ను కలిసేందుకు వెళ్తున్న అభిమానులను కొడుతున్న పోలీసులు.. అందరికీ షేర్ చేయండి’ అంటూ ‘వైఎస్ జగన్ ది లీడర్’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్న ముగ్గురు యువకులు దీనిని పోస్టు చేశారు. అంతే.. అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. షేర్ల మీద షేర్లు అయ్యాయి. ఫేస్‌బుక్, వాట్సాప్.. ఎక్కడా వదల్లేదు. విజయవాడలో జగన్ పాదయాత్ర కొనసాగినంతసేపు ఈ వీడియో హల్‌చల్ చేసింది.

దీంతో స్పందించిన పోలీసులు ఆ వీడియోను పరిశీలించగా అది ఇటీవల నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనకు సంబంధించినదిగా తేలింది. దీంతో ఈ నకిలీ వీడియోను షేర్ చేసి, పోలీసులపై అసత్య ప్రచారానికి పాల్పడిన ఫేస్‌బుక్ పేజీ నిర్వాహకుడు కొల్లపల్లి శ్యామ్‌తోపాటు మరో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News