Lingayat: కర్ణాటకలో కాంగ్రెస్‌కు పెరుగుతున్న బలం.. సిద్ధ రామయ్య ప్రభుత్వానికి లింగాయత్‌ల మద్దతు!

  • వీరశైవ లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదాకు కాంగ్రెస్ సానుకూలం
  • సిద్ద రామయ్యకు మద్దతు ఇవ్వాలంటూ తమ సామాజిక వర్గానికి మఠాధిపతుల పిలుపు
  • కాంగ్రెస్‌లో నూతనోత్సాహం

కర్ణాటకలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతోంది. వీరశైవ లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంతో లింగాయత్‌లు తమ మద్దతును కాంగ్రెస్‌కు ప్రకటించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలంటూ లింగాయత్ ఫోరం తమ సామాజిక వర్గానికి పిలుపునిచ్చింది.

తమకు  మద్దతుగా నిలుస్తున్న వారికి తాము కూడా మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు చిత్రదుర్గ మురుగ మఠానికి చెందిన మఠాధిపతి శివమూర్తి మురుగ రాజేంద్రస్వామి  తెలిపారు. తాము ఎన్నికల రాజకీయంలో పాల్గొనబోమని, తమ ఉద్దేశం అది కాదని పేర్కొన్న ఆయన, తమకు మద్దతు ఇచ్చే వారికి మాత్రం అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు  చెప్పారు. బెంగళూరులో ఫోరం సభ్యులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17 శాతం ఉండడంతో వీరి ఓట్లు కీలకంగా మారాయి. తాను వ్యక్తిగతంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానని, లింగాయత్‌లు అందరూ కాంగ్రెస్‌కు, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు బసవ ధర్మ పీఠానికి చెందిన మాథే మహాదేవి పేర్కొన్నారు. సాంఘిక సంస్కరణలు తీసుకొచ్చిన 12 వ శతాబ్దానికి చెందిన బసవన్న జయంతిని ఏప్రిల్ 18న జరుపుకుంటున్న నేపథ్యంలో అంతకంటే ముందే లింగాయత్‌లకు ప్రత్యేక మైనారిటీ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.

కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలంటూ కొందరు మఠాధిపతులు ఇచ్చిన పిలుపును రంభాపురి పీఠానికి చెందిన వీర సోమేశ్వర శివాచార్య స్వామి తప్పుబట్టారు. వారు (మఠాధిపతులు) అంతగా కావాలనుకుంటే కాంగ్రెస్‌లో చేరాలని సూచించారు. సమాజాన్ని వీరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News