USA: అమెరికాలో మరో దారుణం.. చేతిలోని పైపు ముక్కని తుపాకిగా భావించి కాల్చిచంపిన పోలీసులు

  • చేతిలో పైప్ పట్టుకుని వీధిలో వారికి గురిపెట్టిన నల్లజాతీయుడు
  • ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేసిన స్థానికులు
  • పది రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు

అమెరికాలో మరోసారి నిరాయుధుడైన నల్లజాతీయుడిని కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. సాక్రామెంటోలో నిరాయుధుడైన 22 ఏళ్ల స్టీఫెన్‌ క్లార్క్‌ ను చేతిలో ఫోన్ ను తుపాకీగా భ్రమించి కాల్చి చంపిన ఘటన మర్చిపోకముందే... న్యూయార్క్ లో చేతిలోని పైపు ముక్కను చూసి తుపాకీగా భావించి కాల్చి చంపారు. దాని వివరాల్లోకి వెళ్తే... న్యూయార్క్‌ లోని బ్రూక్లీన్‌ లో గల క్రౌన్‌ హైట్స్‌ ప్రాంతంలోని వీధిలో ఒక వ్యక్తి తుపాకీ లాంటి వస్తువును పట్టుకుని మనుషులకు గురిపెడుతున్నాడని ఎమర్జెన్సీ నంబరు 911కు మూడు ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయి.

 దీంతో అక్కడికి వెళ్లిన నలుగురు పోలీసులకు రెండు చేతులతో తుపాకీ పట్టుకున్న పొజిషల్ లో ఒక వ్యక్తి కనిపించాడు. దీంతో అతని చేతిలో తుపాకీ ఉందని భావించిన పోలీసులు, అతనిపై పది రౌండ్ల తూటాలు కురిపించారు. అనంతరం అతని చేతిలో ఉన్నది తుపాకీ కాదని, ఒక పైప్ అని నిర్ధారించుకున్నారు. కాగా, హతుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని మీడియా తెలిపింది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేసి, ఆందోళన నిర్వహించారు.

More Telugu News