Salman Khan: సల్మాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష... జైలుకు తరలింపు!

  • తుది తీర్పు వెలువరించిన జోధ్ పూర్ కోర్టు
  • కోర్టు ముందు భారీ బందోబస్తు
  • మరికాసేపట్లో జైలుకు కండల వీరుడు

కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఐదు సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తున్నట్టు జోధ్ పూర్ న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది. ఈ కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చిన కోర్టు, మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, సోనాలీ బింద్రే, టబూ, నీలమ్ లను న్యాయమూర్తి నిర్దోషులని ప్రకటించారు. సల్మాన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలని... రెండేళ్ల పాటు మాత్రమే శిక్షను విధించాలని ఆయన తరపు లాయర్ చేసిన విన్నపాన్ని కోర్టు పట్టించుకోలేదు.

1998 అక్టోబర్ లో కంకణి దగ్గర కృష్ణ జింకలను వేటాడినట్టు సల్మాన్ తదితరులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సల్మాన్ పై వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 కింద, మిగతావారిపై సెక్షన్ 149 కింద కేసు అభియోగాలు నమోదు కాగా, మార్చి 28న కేసు విచారణ ముగిసింది. సల్మాన్ కు శిక్ష ఖరారు కాగానే, ఆయన్ను జోధ్ పూర్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు, కోర్టు ఆవరణలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో ఆయన్ను జైలుకు తరలించనున్నారు. ఇక ఈ కేసులో మిగతా నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై బిష్ణోయి సభ హైకోర్టులో అపీలు చేయాలని నిర్ణయించింది.

More Telugu News