amit shah: రెండు చోట్ల ఓటమి గురించే మాట్లాడుతున్నారు.. మా క్లీన్ స్వీప్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు: అమిత్ షా అసహనం

  • పాక్ నుంచి వచ్చే ప్రతి బుల్లెట్ కు బాంబుతో సమాధానం చెప్పాలి
  • బుల్లెట్లు, బాంబుల మధ్య శాంతి చర్చలు అసంభవం
  • త్రిపురలో క్లీన్ స్వీప్ చేశాం.. దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు

భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ నుంచి వచ్చే ప్రతి బుల్లెట్ కు బాంబుతో సమాధానం చెప్పాలని ఆయన సూచించారు. టెర్రరిజాన్ని అరికట్టడం, సరిహద్దుల్లో చొరబాట్లను నివారించాలంటే ఇదొక్కటే పరిష్కార మార్గమని చెప్పారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుల్లెట్లు, బాంబుల మధ్య శాంతి చర్చలు నిర్వహించలేమని స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత కూడా భారత్ లోకి టెర్రరిస్టుల చొరబాట్లు ఎందుకు తగ్గలేదనే ప్రశ్నకు బదులుగా ఆయన ఈ విధంగా స్పందించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతోందని షా అన్నారు. గోరఖ్ పూర్, పూల్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడానికి కారణాలను అన్వేషించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణంగా స్థానిక సమస్యల ఆధారంగానే ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన అన్నారు. ప్రతి స్థానిక ఎన్నికకు ఓ విభిన్నమైన నేపథ్యం ఉంటుందని చెప్పారు.

సాధారణ ఎన్నికల్లో అయితే పెద్దపెద్ద నేతలు, పెద్ద సమస్యలే కీలక పాత్ర వహిస్తాయని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపరేషన్ 2019ని తాము చేపట్టామని తెలిపారు.

మోదీ నాయకత్వంలో తాము ఘన విజయం సాధించబోతున్నామని షా చెప్పారు. గత నాలుగేళ్ల మోదీ పాలన పట్ల అన్ని రాష్ట్రాలు సంతోషంగా ఉన్నాయని... అభివృద్ధి బాటలో సాగుతున్నామని భావిస్తున్నాయని తెలిపారు. గోరఖ్ పూర్, పూల్పూర్ లతో బీజేపీ ఓటమి గురించే అందరూ మాట్లాడుతున్నారని... త్రిపురలో తాము క్లీన్ స్వీప్ చేసిన విషయం గురించి ఎవరూ మాట్లాడటం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

More Telugu News