rajendra prasad: హైదరాబాదులో బానిస బతుకులు బతుకుతున్నారా? బాధ్యత లేదా?: హీరోలపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆగ్రహం

  • ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా ఉన్నారు?
  • తెలుగు ప్రజలిస్తున్న వందల కోట్ల మత్తులో ఉన్నారా?
  • ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తున్నారా?

తెలుగు సినీ పరిశ్రమ పెద్దలపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం 5 కోట్ల మంది తెలుగు ప్రజలు పోరాటం చేస్తుంటే... మీరంతా మౌనంగా ఎందుకు కూర్చున్నారని మండిపడ్డారు. హోదాపై సినీ నటులు, దర్శకనిర్మాతలు ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. తెలుగు ప్రజలు ఇస్తున్న వందల కోట్ల రూపాయలను జేబులో వేసుకుంటూ... ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తున్నారా? అని నిలదీశారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు కూడా మద్దతు ఇచ్చారని... మీకేమయిందని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఈ తెలుగు సినీపరిశ్రమకు ఏమైంది? అని ప్రశ్నించారు. తెలుగు ప్రజలు కురిపిస్తున్న వందల కోట్ల రూపాయల మత్తులో కూరుకుపోయారా? ఆ మత్తు నుంచి బయటకు రారా? అని నిలదీశారు. హైదరాబాదులోనే ఉంటూ బానిస బతుకులు బతుకుతున్న మీకు... ఏదైనా మాట్లాడితే తన్ని తరిమేస్తారని, మీ ఆస్తులను లాక్కుంటారనే భయమేమైనా ఉందా? అని అన్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రే మద్దతు పలికినప్పుడు... మీకెందుకు భయమని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రయోజనాల గురించి మీకు బాధ్యత లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

More Telugu News