apology: వెయ్యి సార్లు క్షమాపణ చెప్పా.. మా ఉద్దేశం వాటిని ఆపడమే: శ్రీరాం సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్

  • పబ్‌పై దాడిని సమర్థించున్న ముథాలిక్
  • పబ్ సంస్కృతిని భారత్‌లో అంతర్భాగం చేయడాన్ని సహించబోమని వ్యాఖ్య
  • అప్పట్లో మంగళూరు నుంచి బహిష్కరణ

2009 మంగళూరు పబ్‌పై దాడి కేసులో శ్రీరాం సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్‌ సహా 24 మందిని కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు అనంతరం ముథాలిక్ మాట్లాడుతూ.. నాటి దాడిని సమర్థించుకున్నారు. పబ్ సంస్కృతి మనది కాదని పేర్కొన్నారు.

జనవరి 24, 2009లో మంగళూరులోని అమ్నేసియా పబ్‌పై దాడి చేసిన శ్రీరాంసేన కార్యకర్తలు నీతినియమాలకు తిలోదకాలిచ్చారని ఆరోపిస్తూ యువతులపై దాడి చేశారు.  జత్తు పట్టుకుని ఈడ్చుకొచ్చినట్టు కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ కేసును విచారించిన కోర్టు సరైన ఆధారాలు లేవంటూ 30 మంది నిందితుల్లో 25 మందిని నిర్దోషులుగా పేర్కొంది.

తాజాగా ముథాలిక్ మాట్లాడుతూ ఈ ఘటనపై గతంలోనే వెయ్యిసార్లకు పైగా క్షమాపణలు చెప్పినట్టు గుర్తు చేశారు. పబ్ సంస్కృతిని మనది కాదని, దానిని భారత్‌లో భాగం చేయడాన్ని తాము సహించబోమని స్పష్టం చేశారు. దానిని ఆపాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. 2009తో మంగళూరు పబ్‌లో మహిళలపై దాడి తర్వాత ఇప్పటి వరకు తాము మరే మహిళపైనా దాడి చేయలేదన్నారు. పబ్‌పై దాడి చేసిన ఏడాది తర్వాత ముథాలిక్‌ను మంగళూరు నుంచి బహిష్కరించారు. 2011లో ముథాలిక్ మాట్లాడుతూ పబ్‌పై దాడి   ‘ఘోర’ తప్పిదమని పేర్కొన్నారు. కాగా, కోర్టు తీర్పుపై పైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తెలిపారు.

More Telugu News