India: కోల్ కతా లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ విగ్రహం ద్వంసం... విగ్రహాల విధ్వంసంపై ప్రధాని సీరియస్... ఎవరైనా సరే ఉపేక్షించబోమని హెచ్చరిక!

  • పలు ప్రాంతాల్లో నేతల విగ్రహాలు ధ్వంసం
  • కేంద్ర హోం శాఖతో చర్చించిన ప్రధాని మోదీ
  • విగ్రహాల వద్ద బందోబస్తుకు ఆదేశాలు

దేశంలోని పలు ప్రాంతాల్లో విగ్రహాల విధ్వంసాలు జరుగుతూ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ అధికారులతో చర్చించారు. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కమ్యూనిస్టు యోధుడు లెనిన్ విగ్రహాన్ని బుల్డోజరుతో ధ్వంసం చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం కాగా, తమిళనాడులో ఉగ్రవాది రామస్వామి విగ్రహాలను ధ్వంసం చేస్తామని బీజేపీ నేత హెచ్ రాజా తన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు సంచలనాన్నే కలిగించింది. ఈ నేపథ్యంలో గత రాత్రి తమిళనాడు వాసులు తమ నేతగా కొలుచుకునే పెరియార్ రామస్వామి విగ్రహం ధ్వంసం చేస్తామనడంపై మోదీ సీరియస్ అయ్యారు.

ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో నిత్యమూ బిజీగా ఉండే కాళీ ఘాట్ ప్రాంతంలో ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (బీజేపీ పూర్వపు పార్టీ అయిన జన సంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు) విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని కూల్చి వేశారు. ఇలా విగ్రహాల కూల్చివేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ సూచించారని, నిందితులు ఎవరైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రిత్వ శాఖ అధికారులు సూచించారు.

ఈ తరహా దాడులు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని ప్రధాని అభిప్రాయపడ్డారని వెల్లడించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని తెలిపారు. తమిళనాడులో పెరియార్ విగ్రహాల వద్ద భద్రతను పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

More Telugu News